Israel: ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్టోబర్ 7నాటి హమాస్ దాడి తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు గంభీరంగా ఉన్నాయి. ఇజ్రాయిల్‌పై దాడికి పరోక్షంగా హమాస్‌కి ఇరాన్ సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల సిరియాపై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ సైన్యానికి చెందిన ఇద్దరు జనరల్స్‌తో పాటు 13 మంది మరణించారు. ఈ దాడికి ఇరాన్ ప్రతీకార దాడులు జరుపుతుందనే అనుమానంతో ఇజ్రాయిల్ అప్రమత్తమైంది. ఈ దాడికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చెప్పారు.
దేశవ్యాప్తంగా రక్షణ సామర్థ్యాన్ని ఇజ్రాయిల్ విస్తరించింది. పవిత్ర రంజాన్ మాసంలో చివరి శుక్రవారం ఏప్రిల్ 5 తర్వాత ఇరాన్ దాడి చేస్తుందని ఇజ్రాయిల్ భావిస్తోంది. దీంతో మున్సిపాలిటీల్లో బాంబు షెల్టర్లను తెరవడం ప్రారంభించింది. జీపీఎస్ నావిగేషన్ సేవల్ని నిలిపేస్తున్నారు. సైనికులకు సెలవుల్ని రద్దు చేసింది, వైమానిక రక్షణ కమాండ్‌ని విస్తరించింది. మరోవైపు పాలస్తీనియన్లకు మద్దతు తెలిపేందుకు ఇరాన్ ఈ రోజును ‘జెరూసలేం డే’గా పాటిస్తోంది.
Read Also: Amazon Layoff: అమెజాన్ వెబ్ సర్వీస్ నుంచి వందలాది మంది ఉద్యోగుల తొలగింపు..
సిరియా రాజధానిలోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై వైమానిక దాడిలో ఇరానియన్ కుడ్స్ ఫోర్స్ కమాండర్ జనరల్ మహ్మద్ రెజా జహేదీ మరనించారు. ఇరాన్ అత్యున్నత మిలిటీరీ అధికారి చనిపోవడంతో ఆ దేశం ఇజ్రాయిల్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. 2020లో యూఎస్ డ్రోన్ దాడిలో ఖుద్స్ ఫోర్స్ కమాండర్ మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ మరణించారు. ఈ దాడి తర్వాత రెజా జహేదీ మరణం అత్యున్నత స్థాయి హత్యగా పరిగణించబడుతోంది. ఇరాన్ ఇప్పటి వరకు నేరుగా ఇజ్రాయిల్‌పై దాడి చేయకుండా దూరంగా ఉంది. ఇటీవల జరిగిన ఇజ్రాయిల్ వైమానిక దాడి పరిస్థితుల్ని మరింత సంక్షోభంలోకి నెట్టాయి.
తప్పకుండా ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతుందనే అనుమానంతో ఇజ్రాయిల్ అధికారులు జీపీఎస్ జామింగ్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సాధ్యమైన గైడెడ్ క్షిపణులను, డ్రోన్ల దాడులను నిరోధించేందుకు జీపీఎస్ నావిగేషన్ సేవలను కట్ ఆఫ్ చేశారు. ఇజ్రాయిల్ తన సరిహద్దులన్నింటిలో బలగాలను మోహరించింది. వైమానిక రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసింది. ముందు జాగ్రత్తగా టెల్ అవీవ్‌లో బాంబు షెల్టర్‌లను తెరిచింది.