Iran-US: ఇరాన్ తాజా వార్నింగ్.. మళ్లీ దాడి చేస్తే యుద్ధం హిందూ మహాసముద్రం దాకా విస్తరిస్తుందని హెచ్చరిక

  • ఇరాన్-అమెరికా మధ్య మాటల యుద్ధం
  • పరస్పరం హెచ్చరికలు-బెదిరింపులు
  • ఇరాన్ తాజా వార్నింగ్
  • ఈసారి హిందూ మహాసముద్రం దాకా విస్తరిస్తుందని హెచ్చరిక
Trump

Trump

ఇరాన్-అమెరికా మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఐక్యరాజ్యసమితి వేదికగా రెండు దేశాలు ఒకరికొకరు హెచ్చరించుకున్నారు. ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ను నరకానికి పంపిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇవ్వగా.. ఇరాన్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యల్ని కొట్టిపారేసింది. ఇరాన్ ఎవరికి తలొగ్గదని తిప్పికొట్టింది. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక గురువారం ఇరాన్ మరో తాజా హెచ్చరిక జారీ చేసింది. అమెరికా లేదా ఇజ్రాయెల్ మరోసారి దాడికి దిగితే మాత్రం యుద్ధం హిందూ మహాసముద్రం వరకు విస్తరించవచ్చని ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ సలహాదారు యాహ్యా రహీమ్ సఫావీ హెచ్చరించారు. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధి నుంచి ఎర్ర సముద్రం వరకు విస్తరించిన ఘర్షణ.. మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు.

ఇరాన్ ప్రభుత్వ మీడియా ఫార్స్ విడుదల చేసిన వీడియో సందేశంలో సఫావీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఘర్షణ ఇప్పటికే పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధి నుంచి ఎర్ర సముద్రం వరకు విస్తరించింది. మరింత యుద్ధం జరిగితే ఈ యుద్ధ రంగం హిందూ మహాసముద్రం వరకు.. ఆపై మరింత దూరం కూడా విస్తరించే అవకాశం ఉంది’’ అని అన్నారు. అయితే హిందూ మహాసముద్రంలో ఏ ప్రాంతాలు లేదా ఎలాంటి లక్ష్యాలను ఉద్దేశిస్తున్నారనే విషయాన్ని సఫావీ స్పష్టంగా చెప్పలేదు. వాణిజ్య నౌకలు, సైనిక స్థావరాలు లేదా నిర్దిష్ట దేశాలను లక్ష్యంగా చేసుకుంటారా అన్న దానిపై కూడా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

మార్చిలోనే యుద్ధం

ఇరాన్ తాజా హెచ్చరికకు ముందు నుంచే యుద్ధం హిందూ మహాసముద్రం వరకు చేరిన ఘటన చోటుచేసుకుంది. మార్చి 4న శ్రీలంక దక్షిణ తీరానికి సమీపంలో ఇరాన్‌కు చెందిన యుద్ధనౌక IRIS Denaను అమెరికా జలాంతర్గామి టార్పెడోతో ముంచినట్లు రాయిటర్స్ నివేదించింది. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో ఇరాన్ నౌకాదళ సిబ్బంది మరణించారు. ఆ నౌక భారత్‌లో నిర్వహించిన నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి ఇరాన్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. శ్రీలంక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. దీంతో పర్షియన్ గల్ఫ్‌కు దూరంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలోనూ యుద్ధ ప్రభావం కనిపించింది.

యూఎన్‌లో పెజెష్కియన్ కీలక వ్యాఖ్యలు

ఇక ఇరాన్ తాజా హెచ్చరిక వెలువడిన సమయంలోనే అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అమెరికాలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. యూఎన్ వేదికగా ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను తిరస్కరించారు. అమెరికా ఒత్తిడికి ఇరాన్ లొంగిపోదని పెజెష్కియన్ స్పష్టం చేశారు. అయితే యుద్ధానికి ముగింపు పలికేందుకు దౌత్య మార్గంలో పరిష్కారం కోసం ఇరాన్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలను ఆయన ‘‘బెదిరింపు ధోరణి’’గా అభివర్ణించారు. ఇరాన్‌ను ప్రపంచంలో ఉగ్రవాదానికి ప్రధాన మద్దతుదారుగా ట్రంప్ అభివర్ణించిన వ్యాఖ్యలను కూడా ఖండించారు. తమను ఉగ్రవాదులుగా పిలుస్తున్న వారు ఇరాన్ ప్రజలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ప్రతిఘటిస్తోందని, ఒత్తిడికి తలొగ్గేది లేదని చెప్పారు. మరోవైపు యుద్ధాన్ని ముగించేందుకు దౌత్య చర్చలకు అవకాశం ఉందని పేర్కొన్నారు.

హార్ముజ్‌పై ఉద్రిక్తత

ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలకు హార్ముజ్ జలసంధి కీలక కేంద్రంగా మారింది. ప్రపంచ చమురు, ద్రవీకృత సహజ వాయువు సరఫరాలో భారీ భాగం ఈ మార్గం మీదుగా సాగుతుంది. దీంతో ఇక్కడ ఏదైనా అంతరాయం ఏర్పడితే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. హార్ముజ్‌ను తిరిగి తెరవడానికి అమెరికా సైనిక ఒత్తిడి తగ్గించడం, ఇరాన్‌పై నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడం వంటి షరతులను ఇరాన్ ప్రతిపాదించినట్లు రాయిటర్స్ తెలిపింది. సెప్టెంబర్ 22న ఇరాన్ అధికారి ఒకరు.. అమెరికా తన సైనిక ఒత్తిడిని తగ్గిస్తే హార్ముజ్‌ను వారంలోపు తెరవడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

భారత్‌లో ఆందోళనలు?

యుద్ధం హిందూ మహాసముద్రం వరకు విస్తరించే అవకాశం ఉందన్న హెచ్చరిక భారత్‌కు కూడా ప్రాధాన్యమైన అంశంగా మారింది. పశ్చిమాసియా నుంచి భారత్‌కు వచ్చే ఇంధన సరఫరాలు, సముద్ర వాణిజ్య మార్గాలు ప్రభావితమయ్యే అవకాశం ఉండటంతో ఈ ప్రాంతంలో మరింత ఉద్రిక్తత ఏర్పడితే చమురు ధరలు, షిప్పింగ్ ఖర్చులు, బీమా వ్యయాలపై ఒత్తిడి పెరగవచ్చని విశ్లేషణలు చెబుతున్నాయి. అయితే సఫావీ చేసినది ప్రస్తుతానికి ఒక హెచ్చరిక మాత్రమే. యుద్ధం హిందూ మహాసముద్రంలో ఏ రూపంలో విస్తరిస్తుంది. ఎవరిని లక్ష్యంగా చేసుకుంటుంది అనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. దీంతో ఈ వ్యాఖ్యల తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది.