ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చితే యూరప్‌లోని అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక వసతులపై దాడులు చేసే అవకాశాలను ఇరాన్ పరిశీలిస్తున్నట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. ఇరాన్ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న వర్గాలను ఉటంకిస్తూ ఈ విషయాన్ని వెల్లడించాయి.
ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య యుద్ధాన్ని ముగించేందుకు, అలాగే కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు జరుగుతున్న చర్చలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ తదుపరి వ్యూహాలపై ఆలోచిస్తున్నట్లు సమాచారం.
సైప్రస్‌లో బ్రిటన్ స్థావరం టార్గెట్?
మీడియా నివేదిక ప్రకారం.. ఇరాన్ పరిశీలిస్తున్న లక్ష్యాల్లో సైప్రస్‌లోని బ్రిటన్ వైమానిక స్థావరం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మార్చిలో ఈ స్థావరంపై డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. దక్షిణ-తూర్పు యూరప్‌లోని మరికొన్ని ప్రాంతాలను కూడా ఇరాన్ పరిశీలించినట్లు సమాచారం. ముఖ్యంగా బల్గేరియాలోని బెజ్‌మెర్ వైమానిక స్థావరానికి అమెరికా సైన్యానికి ఇంధన నింపే సదుపాయాన్ని కల్పించేందుకు గత నెలలో అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో ఈ స్థావరం కూడా ఇరాన్ లక్ష్యాల జాబితాలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
సముద్రగర్భ కేబుల్స్‌పైనా దాడి?
యుద్ధం మరింత విస్తరించిన పక్షంలో హార్ముజ్ జలసంధిలోని సముద్రగర్భ ఫైబర్-ఆప్టిక్ కేబుల్స్‌పై దాడి చేసే అవకాశాన్ని కూడా ఇరాన్ సైనిక దళాలు పరిశీలించినట్లు ఓ వర్గం వెల్లడించినట్లు తెలిపింది. అమెరికా మరోసారి భారీ స్థాయిలో దాడులకు దిగితే.. ఇరాన్ సైనిక కమాండర్లు ఇప్పటివరకు అనుసరించిన వ్యూహాన్ని మార్చే అవకాశం ఉందని హెచ్చరించినట్లు సమాచారం. ఇప్పటివరకు మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక వసతులనే ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్న ఇరాన్.. పరిస్థితులు మరింత దిగజారితే ఆ పరిధిని విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఇరాన్‌తో ‘‘వాణిజ్యం, వాణిజ్య మార్పిడి, ఆర్థిక లావాదేవీలను’’ నిలిపివేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. దీనికి ఒక రోజు ముందు.. ఇరాన్ నుంచి తమ ప్రాదేశిక జలాల వైపు రెండు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు UAE రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఆ రెండు క్షిపణులు సముద్రంలోనే పడిపోయాయని, ఎలాంటి నష్టం లేదా ప్రాణనష్టం సంభవించలేదని వెల్లడించింది.
ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య చర్చలు నిలిచిపోవడం, హార్ముజ్ జలసంధిపై ఉద్రిక్తతలు కొనసాగడం, యూరప్‌లోని అమెరికా స్థావరాలను ఇరాన్ సంభావ్య లక్ష్యాలుగా పరిశీలిస్తున్నట్లు వస్తున్న వార్తలతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి.

