ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. హార్ముజ్‌లో ఇరాన్ సరుకు రవాణా నౌకను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేసింది. అంతేకాకుండా నౌకను స్వాధీనం చేసుకుంది. దీంతో ఇరాన్ కూడా ప్రతీకారంగా అమెరికా సైనిక నౌకలపై డ్రోన్ దాడులు చేస్తోంది. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. శాంతి ఒప్పందంతో పరిస్థితులు చక్కబడతాయని అనుకుంటుంటే.. మళ్లీ మొదటికొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయ.
ఇస్లామాబాద్ వేదికగా రెండో విడత చర్చల కోసం రెండు దేశాలు సిద్ధపడుతున్న తరుణంలో మధ్యప్రాచ్యంలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒమాన్ సముద్రంలో అమెరికా సైనిక నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడులు జరిపినట్లు ఇరాన్‌కు చెందిన సెమీ-ఆఫిషియల్ టస్నీమ్ వార్తా సంస్థ వెల్లడించింది. అమెరికా చర్యలకు ప్రతిగా ఈ దాడులు జరిగినట్లు తెలిపింది. అయితే ఈ దాడుల్లో ఎన్ని డ్రోన్లు ఉపయోగించారో.. అమెరికా నౌకలకు ఎంత నష్టం జరిగింది అనేది స్పష్టత ఇవ్వలేదు.
ట్రంప్ ప్రకటన..
ఇరాన్‌కు చెందిన ‘టౌస్కా’ అనే కార్గో నౌక హార్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా విధించిన నౌకా దిగ్బంధనాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో అమెరికా మెరైన్స్ నౌకపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ప్రస్తుతం ఆ నౌక పూర్తిగా అమెరికా నియంత్రణలో ఉందని వెల్లడించారు. అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా ఈ ఆపరేషన్‌ను ధృవీకరించింది. నౌక స్వాధీనం చేసుకున్న దృశ్యాలను విడుదల చేసింది.
ఇరాన్ విమర్శ
అమెరికా చర్యను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఖాతమ్ అల్-అన్బియా సైనిక కమాండ్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే కాకుండా “ఆర్మ్డ్ పైరసీ” అని పేర్కొన్నారు. అమెరికా దళాలు నౌకపై కాల్పులు జరిపి.. నావిగేషన్ వ్యవస్థను నిలిపివేసి సిబ్బందిని పంపించాయని ఆరోపించారు. ఈ చర్యలకు తగిన ప్రతిస్పందన ఇస్తామని హెచ్చరించారు. మొదట నౌక స్వాధీనం కాలేదని చెప్పిన ఇరాన్.. తర్వాత అమెరికా ధృవీకరణ తర్వాత ఆ విషయాన్ని అంగీకరించింది. ఆ నౌక చైనా నుంచి ఇరాన్‌కు వస్తోందని తెలిపింది.
చర్చలపై అనిశ్చితి
తాజా పరిణామాలతో రెండు దేశాల మధ్య కొనసాగుతున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ప్రతిపాదించిన రెండో విడత చర్చలకు ఇరాన్ నిరాకరించింది. నౌకా దిగ్బంధనం, అమెరికా విధిస్తున్న కఠిన షరతులు కారణంగా చర్చలు జరగవని తెలిపింది.
ట్రంప్ హెచ్చరికలు
అమెరికా షరతులను అంగీకరించకపోతే ఇరాన్ వంతెనలు, విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ హెచ్చరికలకు ప్రతిగా ఇరాన్ స్పందిస్తూ.. తమ దేశంలోని పౌర మౌలిక సదుపాయాలపై దాడులు జరిగితే గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
