Site icon NTV Telugu

Anti-Hijab Protest: ఈ అల్లర్లకు కారణం.. ఆ రెండు దేశాల కుట్రే!

Anti Hijab Iran Supreme

Anti Hijab Iran Supreme

Iran Supreme Leader Ayatollah Ali Khamenei Breaks Silence On Anti Hijab Protests: మూడు వారాల నుంచి ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతోన్న ఆందోళనలపై ఎట్టకేలకు ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేని స్పందించారు. ఈ నిరసనల్ని తాను ఖండిస్తున్నానని ప్రకటించిన ఆయన.. అమెరికా, ఇజ్రాయెల్ పన్నిన కుట్ర ప్రకారమే ఈ ఆందోళనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘‘ఈ ఆందోళనలకి ముఖ్య కారణం.. అమెరికా, యూదుల పాలకులు, వారి ఉద్యోగులే. ఇటువంటి ఘటనలు అసాధారణమైనవి’’ అని ఆయన చెప్పారు. ఇదే సమయంలో ‘మహ్సా అమిని’ అమ్మాయి మృతి గురించి ప్రస్తావించిన ఆయన.. ఆ ఘటన తమనెంతో కలిసి వేసిందని అన్నారు.

ఇదిలావుండగా.. హిజాబ్‌కు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలతో ఇరాన్‌ అట్టుడుకుతూనే ఉంది. వేలమంది మహిళలు రోడ్ల మీదకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. భద్రతా దళాల అణచివేతలో ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ.. నియంత పాలనకు ముగింపు పలకాల్సిందేనని తెగించి పోరాటం చేస్తున్నారు. దీంతో.. నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతామని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. హింసాత్మక ఘటనల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెచ్చరించారు. కాగా.. హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న మాహ్సా అమిని అనే యువతిని అరెస్ట్ చేయడం, ఆమె సెప్టెంబర్‌ 16న ప్రాణాలు కోల్పోవడం వల్లే ఈ ఆందోళనలకు ప్రధాన కారణం.

మరోవైపు.. ఇరాన్ నిరసనకారుల్ని అణిచివేసేందుకు అక్కడి ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యల్లో భాగంగా 92 మంది మరణించినట్టు నార్వేకు చెందిన మానవ హక్కుల సంస్థ ప్రకటించింది. సోషల్ మీడియాపై బ్యాన్ కూడా విధించింది. అయినప్పటికీ మహిళలు వెనక్కు తగ్గకుండా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. హిజాబ్ విసిరేస్తూ, జుట్టు కత్తిరించుకుంటూ.. ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

Exit mobile version