Site icon NTV Telugu

Iran Warns Protests: ఇరాన్‌లో ఆందోళనకారులపై కఠిన ఆంక్షలు.. నిరసనల్లో పాల్గొంటే మరణశిక్షే!

Iran

Iran

Iran Warns Protests: ఇరాన్‌లో గత రెండు వారాలుగా కొనసాగుతున్న భారీ నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తుంది. ఇరాన్ అటార్నీ జనరల్ మొహమ్మద్ మొవాహెది అజాద్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. నిరసనల్లో పాల్గొనే వారిని ‘దేవుని శత్రువులు (మొహారెబ్)’గా పరిగణిస్తామని, అలాంటి నేరానికి మరణశిక్ష వర్తిస్తుందని స్పష్టం చేశారు. నిరసనల్లో పాల్గొన్న వారే కాకుండా ‘అల్లరిమూకలకు సహకరించిన వారు కూడా’ ఇదే నేరానికి బాధ్యులవుతారని పేర్కొన్నారు. ఇరాన్ చట్టంలోని ఆర్టికల్ 186 ప్రకారం, ఇస్లామిక్ రిపబ్లిక్‌కు వ్యతిరేకంగా ఆయుధాలతో పోరాడే ఏ సంస్థకైనా మద్దతు ఇచ్చిన వారు మొహారెబ్‌గా పరిగణించబడతారని తెలిపారు.

Read Also: PM Modi: సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు.. 72 గంటల పాటు ‘ఓం’ జపం

మొహారెబ్ నేరానికి కఠిన శిక్షలు
ఇరాన్ శిక్షా నియమావళిలోని ఆర్టికల్ 190 ప్రకారం, ‘మొహారెబ్’ నేరానికి అత్యంత కఠిన శిక్షలు ఉన్నాయి. మరణశిక్ష, ఉరి, కుడి చేయి–ఎడమ కాలి తొలగింపు, శాశ్వత అంతర్గత నిర్బంధం (దేశంలోనే బహిష్కరణ) లాంటి శిక్షలు విధించే అవకాశం ఉందని చట్టం పేర్కొంటుంది.

ఎలాంటి సడలింపులు ఉండవు: ప్రాసిక్యూషన్
అమెరికా హెచ్చరికలను లెక్క చేయకుండా టెహ్రాన్ సర్కార్ ఈ కఠిన చర్యలకు సిద్ధమైంది. ప్రాసిక్యూటర్లకు జారీ చేసిన ఆదేశాల్లో దేశంలో అస్థిరత సృష్టించి, విదేశీ ఆధిపత్యానికి మార్గం వేయాలనుకునే వారిపై విచారణ ఆలస్యం చేయకుండా, ఎలాంటి కనికరం లేకుండా దర్యాప్తు చేయాలని తెలిపారు. ఇక, అమెరికా కేంద్రంగా పని చేస్తున్న మానవ హక్కుల కార్యకర్తల వార్తా సంస్థ ప్రకారం, ఇప్పటి వరకు ఈ నిరసనల్లో సుమారు 65 మంది మరణించారు, అలాగే 2,300 మందికిపైగా అరెస్టయ్యారు. పరిస్థితి మరింత తీవ్రంగా మారడంతో, టెహ్రాన్‌లో ఇంటర్నెట్ సేవలు, సెల్ ఫోన్ సిగ్నల్ నిలిపివేశారు.

Read Also: PM Modi: సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు.. 72 గంటల పాటు ‘ఓం’ జపం

ప్రవాస యువరాజు పిలుపుతో..
ఇక, ఇరాన్‌కు చెందిన ప్రవాస యువరాజు రెజా పహ్లవి ప్రజలను మరోసారి రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు. జనవరి 10, 11వ తేదీల్లో నిరసనల్లో పాల్గొని, షా పాలన కాలంలో వాడిన సింహం–సూర్యుడు జెండాతో పాటు జాతీయ చిహ్నాలను ప్రదర్శిస్తూ ప్రజా స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరారు. అయితే, ఈ నిరసనలు మొదటగా ఇస్లామిక్ రిపబ్లిక్‌పై ఉన్న అసంతృప్తితో ప్రారంభమయ్యాయి. 2025 డిసెంబర్ చివర్లో ఇరాన్ కరెన్సీ రియల్ ఒక్క అమెరికన్ డాలర్‌కు 14 లక్షల స్థాయికి పడిపోవడంతో పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఆర్థిక సంక్షోభం క్రమంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారింది. మొత్తంగా, ఇరాన్‌లో పరిస్థితి రోజు రోజుకీ ఉద్రిక్తంగా మారుతుండగా, ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది.

Exit mobile version