ఇరాన్‌లో ప్రస్తుతం విషాదఛాయలు అలుముకున్నాయి. ఏ ఒక్కరినీ చూసినా.. భావోద్వేగంతో కనిపిస్తున్నారు. ఇరానీయులంతా దు:ఖసంద్రంలో మునిగిపోయారు. దివంగత మాజీ సుప్రీం లీడర్ ఖమేనీని గుర్తుచేసుకుంటూ కన్నీటిపర్యంతం అవుతున్నారు. నేటితో ప్రారంభమైన అంత్యక్రియ కార్యక్రమాలు జూలై 9న ఖననంతో ముగుస్తోంది. దేశ, విదేశాల నుంచి వచ్చిన వారంతా ఖమేనీకి నివాళులర్పిస్తున్నారు.
అయితే ఇదంతా ఒకెత్తు అయితే అంత్యక్రియల్లో కుమారుడు మొజ్తబా కనిపించకపోవడంతో కొత్త చర్చకు దారి తీసింది. భద్రతా కారణాలు కారణంగా రాలేదని ఇరాన్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. మొజ్తబా కూడా చనిపోయి ఉంటాడని చర్చించుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలోనూ… ప్రజల్లోనూ తీవ్ర చర్చగా మారింది. ప్రస్తుతం ఇరాన్‌లో మొజ్తబా ఖమేనీ చుట్టే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు సోషల్ మీడియాలో మొజ్తబా కూడా మరణించి ఉండొచ్చంటూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే జరుగుతున్న ప్రచారాలను ఇరాన్ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో చనిపోయిన అలీ ఖమేనీ అంత్యక్రియలు శుక్రవారం టెహ్రాన్‌లో ప్రారంభమయ్యాయి. ఆరు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాలు జూలై 9న మష్హాద్‌లో ఖననంతో ముగియనున్నాయి. ఈ కార్యక్రమాలకు ఇరాన్ ఉన్నత నాయకులు, సైనికాధికారులు, విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. అయితే దేశ అత్యున్నత నాయకుడిగా ఉన్న మొజ్తబా ఖమేనీ మాత్రం ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశమైంది.
మొజ్తబా ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకాకపోవడానికి భద్రతా కారణాలే కారణమని ఇరాన్ అధికారులు వివరణ ఇచ్చారు. మొజ్తబా ప్రతినిధిగా పేర్కొంటున్న అయతల్లా హకీమ్ ఎలాహీ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ నుంచి ఉన్న భద్రతా ముప్పు, నిఘా చర్యల నేపథ్యంలో ఆయన బహిరంగంగా కనిపించడం ప్రమాదకరమని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో మొజ్తబా లక్ష్యంగా మారే అవకాశం ఉందనే ఆందోళనతోనే ఆయన ప్రజల్లోకి రావడం లేదని వెల్లడించారు.
అయితే మొజ్తబా ఖమేనీ మరణించారనే వార్తలకు ఇప్పటివరకు విశ్వసనీయమైన ఆధారాలు లేవు. ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికీ ఆయన్నే దేశ సుప్రీం లీడర్‌గా పేర్కొంటోంది. ఆయన గైర్హాజరుకు సంబంధించి అధికారికంగా భద్రతా కారణాలనే చెబుతోంది. మరణం లేదా తీవ్ర అనారోగ్యం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇక మూడు దశాబ్దాలకుపైగా ఇరాన్‌ను నడిపించిన అలీ ఖమేనీ మరణం దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. యుద్ధం, ఆంక్షలు, అంతర్గత రాజకీయ ఒత్తిళ్లతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇరాన్‌లో మొజ్తబా ఖమేనీ దీర్ఘకాలంగా ప్రజల ముందుకు రాకపోవడం భవిష్యత్ రాజకీయాలపై మరిన్ని ప్రశ్నలకు దారితీస్తోంది. ప్రస్తుతం ఆయన గైర్హాజరు వెనుక అసలు కారణాలపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది.

