అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా కువైట్ విమానాశ్రయంతో సహా అమెరికా స్థావరాలపై ఇరాన్ బాంబు దాడులు చేసింది. అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు దాడి చేయడం ఇది 88వ సారి కావడం విశేషం.
ఇక ఉత్తర ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలతో పాటు టెల్ అవీవ్, కిరియత్ ష్మోనా, బ్నై బ్రాక్ నగరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఐఆర్‌జీసీ తెలిపింది. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. మీడియా కథనాల ప్రకారం.. ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడులను యూఏఈ, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, జోర్డాన్ దేశాలు ఖండించాయి.
కువైట్ ధృవీకరణ..
ఇక ఇరాన్ దాడులను కువైట్ ధృవీకరించింది. ఎయిర్‌పోర్టుపై దాడి జరిగినట్లుగా తెలిపింది. కువైట్ వాయు రక్షణ వ్యవస్థలు ప్రస్తుతం శత్రువుల క్షిపణి, డ్రోన్ దాడులను ఎదుర్కొంటోందని పేర్కొంది. వినబడే ఏవైనా పేలుడు శబ్దాలు, వాయు రక్షణ వ్యవస్థలు శత్రు దాడులను అడ్డుకోవడం వల్లే వస్తున్నాయని ఆర్మీ జనరల్ స్టాఫ్ స్పష్టం చేసింది. సంబంధిత అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను ప్రతిఒక్కరూ పాటించాలి’’. అని కువైట్ సైన్యం ట్వీట్ చేసింది.
అధికారుల ప్రకారం.. కువైట్‌లోని ముబారక్ అల్ కబీర్ పోర్టును డ్రోన్‌లు, క్రూయిజ్ క్షిపణులు దాడి చేసినట్లు సమాచారం. ఇక క్షిపణులు, డ్రోన్‌లు, రాకెట్ల నుంచి ఇరాకీ గగనతలానికి ముప్పు పొంచి ఉన్నందున… అమెరికా పౌరులు ఇరాక్‌ను విడిచిపెట్టి వెళ్లాలని… బాగ్దాద్‌లోని రాయబార కార్యాలయానికి లేదా ఎర్బిల్‌లోని కాన్సులేట్ జనరల్‌కు ప్రయాణించవద్దని అమెరికా రాయబార కార్యాలయం కోరింది. గగనతలం మూసివేయబడినందున ఇరాక్ విడిచి వెళ్లేవారు జోర్డాన్, కువైట్, సౌదీ అరేబియా, టర్కీలకు రోడ్డు మార్గంలో ప్రయాణించాలని సూచించింది.
