Iran: ఇరాన్ లోని మత ప్రభుత్వానికి మరో యువతి ప్రాణం బలైంది. గతేడాది హిజాబ్ ధరించలేదని మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతిపై అక్కడి మోరాలిటీ పోలీసులు దాడి చేయగా ఆమె మరణించింది. ఇది ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక ఉద్యమానికి ఊపిరి పోసింది. దేశంలో పెద్ద ఎత్తన హిజాబ్ వ్యతిరేక నిరసనలు, అల్లర్లు చెలరేగాయి. ఈ ఉద్యమంలో 500 మందికి పైగా మరణించారు. అయితే అక్కడి ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేసింది.
ఇదిలా ఉంటే 16 ఏళ్ల అర్మితా గరవాండ్ అనే యువతి కూడా హిజాబ్ ధరించనందుకు అక్కడి అధికారులు దాడికి పాల్పడ్డారు. గత నెల రోజులగా కోమాలో ఉన్న అర్మితా మరణించింది. టెహ్రాన్ లోని మెట్రోలో వెళ్తున్న సమయంలో హిజాబ్ ధరించలేదని కుర్దిష్ మహిళ అయిన అర్మితాపై అధికారులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగి నెల రోజులు అయింది. బ్రెయిన్ డెడ్ అయిన బాధితురాలు శనివారం మరణించినట్లు ఇస్లామిక్ రిపబ్లిక్ లోని మీడియా తెలియజేసింది.
Read Also: Babu Mohan: ఈసారి పోటీ చేయడం లేదు.. బీజేపీకి రాజీనామా చేస్తా: బాబు మోహన్
టెహ్రాన్ లోని అర్మితా గరావాండ్ అనే విద్యార్థి ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్, ఇంటెన్సెవ్ ట్రీట్మెంట్ లో 28 రోజల తర్వాత మరణించినట్లు యువజన మంత్రిత్వ శాఖతో అనుబంధం ఉన్న బోర్నా వార్తా సంస్థ తెలిపింది. అధికారులు దాడి చేయడంతో మెట్రోలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఇరాన్ లో నైతికత పోలీసులు దాడి చేయడం వల్లే అర్మితా మరణించినట్లు హక్కుల సంఘాలు తెలిపాయి.
ఇరాన్ వ్యాప్తంగా అక్కడి యువత, ముఖ్యంగా మహిళలల్లో హిజాబ్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. అయతుల్లా ఖమేనీ ప్రభుత్వం ఇస్లామిక్ చట్టాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఎవరైనా డ్రెస్ కోడ్ ఉల్లంఘించినట్లయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవల అక్కడి ప్రభుత్వం హిజాబ్ ఉల్లంఘిస్తే 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించాలని తీర్మానించింది. ప్రస్తుతం అర్మితా మరణం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.