iOS 16 Coming With 7 News Features: ఐఫోన్ యూజర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. ఐఓఎస్ 16ని సెప్టెంబర్ 16వ తేదీన విడుదల చేయబోతున్నట్టు యాపిల్ సంస్థ ప్రకటించింది. తాజాగా ఐఓఎస్ 16 బీటా వర్షన్‌ను లాంచ్ చేసింది. ఎప్పట్లాగే ఈసారి కూడా కొత్త ఫీచర్స్‌ని యాపిల్ సంస్థ తీసుకొస్తోంది. మరో విషయం ఏమిటంటే.. ఆండ్రాయిడ్ తరహాలోనే స్క్రీన్, విడ్జెట్స్, నోటిఫికేషన్ బార్ సెక్షన్స్‌లో కస్టమైజేషన్ ఫీచర్స్‌ను పరిచయం చేయనుంది. మరి, ఆ కొత్త ఫీచర్స్ ఏంటో తెలుసుకుందామా?
1. లాక్‌స్క్రీన్ కస్టమైజేషన్: యూజర్లు తమకు నచ్చినట్లు లాక్‌స్క్రీన్ మీద క్లాక్‌ను వివిధ ఫాంట్‌లు, రంగులు ఉపయోగించి మార్చుకోవచ్చు. దీంతోపాటు లాక్‌స్క్రీన్‌లో నాలుగు విడ్జెస్ట్ కూడా పెట్టుకోవడానికి వీలు కల్పించింది. ఒకటి క్లాక్ పైన, మిగతా మూడు కింద భాగంలో పెట్టొచ్చు. అంతేకాదు.. ఆండ్రాయిడ్ తరహాలోనే హోం స్క్రీన్, లాక్‌స్క్రీన్‌కు వేర్వేరు వాల్‌పేపర్లు పెట్టుకోవచ్చు.
2. ఐమెసేజ్ ఎడిట్: ఐమెసేజ్‌లో పంపిన మెసేజ్‌లను ఎడిట్, అన్‌సెండ్ చేసుకోవచ్చు. అయితే.. ఈ మార్పులు 15 నిమిషాల లోపే చేయాల్సి ఉంటుంది. మెసేజ్ పంపిన తర్వాత దానిపై టాప్ చేస్తే.. ఎడిట్, అన్‌సెండ్ ఆప్షన్లు కనిపిస్తాయి. ఐఓఎస్ 15లోనూ ఎడిట్ ఆప్షన్ ఉండేది కానీ, అవతలి వారికి ‘ఎడిటెడ్ టూ’ అని కనిపించేది. కానీ, ఐఓఎస్ 16లో మెసేజ్ ఎడిట్ చేసినట్లు అవతలి వారికి తెలియదు.
3. ఫుల్ స్క్రీన్ మ్యూజిక్ ప్లేయర్: మ్యూజిక్ ప్లేయర్ ఆన్ చేసిన వెంటనే ఫోన్ లాక్ పడినా, ఫుల్ స్క్రీన్‌లో మ్యూజిక్ ప్లేయర్ కనిపిస్తుంది. దానికి తగ్గట్టు లాక్‌స్క్రీన్ బ్యాక్‌గ్రౌండ్ మారుతుంది. ఒకవేళ ఫుల్ స్క్రీన్ వద్దనుకుంటే, కింది భాగంలో టచ్ చేస్తే మినిమైజ్ అవుతుంది. ఐఓఎస్ 10 లో కూడా ఫుల్ స్క్రీన్ మ్యూజియ్ ప్లేయర్ ఫీచర్ ఉండేది కానీ.. బ్యాక్‌గ్రౌండ్ కలర్ మారేవి కావు, మినిమైజ్ ఆప్షనూ లేదు.
4. ఐక్లౌడ్ ఫోటో లైబ్రరీ: ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఫోటోలను తమతో పాటు మరో ఐదుగురితో కలిసి షేర్, ఎడిట్, డిలీట్ చేసుకునేందుకు యాడ్ చేసుకోవచ్చు. దీంతో.. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఫోటో షేరింగ్ మరింత సులభతరం అవుతుంది.
5. యాపిల్ పే ఆర్డర్ ట్రాకింగ్: వాలెట్ యాప్‌లో యాపిల్ పే ద్వారా ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్ చేస్తే.. దాని స్టేటస్ కనుగొనేందుకు బిల్ట్-ఇన్ ఆర్డర్ ట్రాకింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్యాకేజీ డెలివరీ దగ్గర నుంచి ఎప్పుడు డెలివరీ అవుతుందన్న వివరాల్ని ఇది తెలియజేస్తుంది.
6. ఫిట్నెస్: కొత్త ఓఎస్‌తో పిట్నెస్ యాప్‌ను అన్ని ఐఫోన్ మోడల్స్ యూజర్స్‌కి పరిచయం చేస్తున్నారు. ఇంతకుముందు ఈ యాప్ యాపిల్ వాచ్‌లో మాత్రమే ఉండేది. ఐఫోన్‌లోని మోషన్ సెన్సార్ ఆధారంగా, రోజులో ఎన్ని కేలరీలు ఖర్చు చేశారన్న సమాచారం యాప్‌లో స్టోర్ అవుతుంది.
7. గేమింగ్: గేమింగ్ ఫీచర్ ద్వారా యూజర్లు మరిన్ని బ్లూటూత్ గేమింగ్ కంట్రోల్స్‌ని ఉపయోగించవచ్చు. వీటిలో నిన్‌టెండో జాయ్-కాన్స్ అండ్ ప్రో కంట్రోలర్ ఉన్నాయి.