ప్రపంచంలో ఎన్నో వింతలు ఉంటాయి. ఎన్నో ఆచారాలు ఉంటాయి. ఆ ఆచారాలు.. విశేషాలు తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. అందరూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ, కొన్ని తేగల ఆచారాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తుంటాయి. ఇలాంటి ఆచారాల్లో డానీ తెగ ఆచారం చాలా వింతగా ఉంటుంది. వింతగా ఉండటమే కాదు.. భయంకరంగా ఉంటుంది. ఇండోనేషియాలోని పాపువా న్యూ గినియాలో నివసించే డాని తెగకు చెందిన ఆదివాసీల ఆచారాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఈ ఆచారాలు గురించి తెలిస్తే.. షాక్ తింటారు. అసలు ఇప్పటికీ ఇలాంటి సంప్రదాయాలను పాటించే వారున్నారా అంటూ ఆలోచిస్తారు. ఈ తెగ ఒకటి ఉందని 83 సంవత్సరాల క్రితం వరకూ ప్రపంచానికి తెలియదు. ఈ తెగ ప్రజలకు దూరంగా జీవిస్తుంది.. కనుక వీరి చిత్రాలను తీయడం చాలా కష్టం. అయితే కొంతమంది.. ఆ గిరిజన ఆచార వ్యవహారాలను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో వారిని కలిశారు. వారి చిత్రాలను, వింత ఆచారాలను ప్రపంచం ముందుకు తీసుకుని వచ్చారు.
ఇంట్లో సగం కాలిన శవాన్ని అలకరించుకుంటారు. వందల ఏళ్ల క్రితం ఈ మనుషులు మనుషుల శవాలను తిని జీవించేవారని.. కాలక్రమంలో జంతువులను చంపి వాటి మాంసాన్ని తినడం ప్రారంభించారని తెలుస్తోంది. ఈ తెగ మరో విచిత్రమైన ఆచారం ఏమిటంటే.. తమ బంధువులు, లేదా సొంత కుటుంబ సభ్యులు మరణిస్తే.. వారు ఆ మృతదేహాన్ని పూడ్చిపెట్టరు.. లేదా పూర్తిగా కాల్చరు. సగం కాల్చి ఆ మృతదేహాలను ఇంటికి తీసుకుని వస్తారు. మీడియా కథనాల ప్రకారం.. మృతదేహాలను సగం వరకు కాల్చిన తర్వాత, ఈ వ్యక్తులు దానిపై పంది కొవ్వును రాసి ఆ శవాలను మమ్మీలుగా చేసి ప్రత్యేక గుడిసెలో ఉంచుతారు. ఈ గుడిసెలోకి అందరినీ వెళ్లనివ్వరు. ఎంపిక చేసిన కొందరిని మాత్రమే గుడిసె లోపలికి అనుమతిస్తారు. వారు కూడా మమ్మీని తాకరు.
ఈ తెగ అత్యంత ప్రమాదకరమైన ఆచారం ఏమిటంటే, ఎవరైనా చనిపోయినప్పుడు.. ఆ వ్యక్తి కుటుంబంలో ఉన్న స్త్రీ వేలుని కత్తిరిస్తారు. చేతివేళ్లు బలి ఇవ్వడాన్ని ఇకిపలిన్ అంటారు. ఇలా ఒక్కసారి కాదు.. ప్రతి సారీ జరుగుతుంది.. అంటే ఎవరైనా ఇంట్లోని కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడల్లా స్త్రీ ఒకొక్క వేలు కత్తిరించబడుతుందన్నమాట. ఇది వినడానికి చదవటానికి భయంకరంగా ఉన్నది కదా. ఈ ఆచారాన్ని అక్కడి ప్రభుత్వం నిషేదించింది. అనాగరికమైన ఆచారాల నుంచి బయటకు రావాలని డానీ తెగ ప్రజలను ప్రభుత్వం కోరుతున్నది. వారిలో నాగరికతను పెంచేందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. కానీ, పట్టించుకోవడం లేదు. ఈ డానీ తెగలో దాదాపు 2.50 లక్షలమంది నివసిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కొంతమందిని ప్రభుత్వం వారిలో మార్పులు తీసుకొచ్చింది. వారిని సమూలంగా మార్చి ఈ ఆచారాన్ని రూపుమాపే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ఇది ఎప్పటికి సాధ్యం అవుతుందో చూడాలి.
