Maldives: హిందూ మహాసముద్రంలో ద్వీప దేశం మాల్దీవులు ఇండియాకు చాలా కీలకం. అయితే ఈ దేశంపై పట్టుపెంచుకునేందుకు చైనా కూడా చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల చైనా మద్దతు పలుకుతూ, ఇండియాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న మహ్మద్ మయిజ్జు అక్కడి ఎన్నికల్లో విజయం సాధించి ప్రెసిడెంట్ కాబోతున్నాడు. ఈ పరిణామం భారత్‌కి మింగుడుపడని అంశంగా మారింది.
మాల్దీవులు పూర్తిగా స్వతంత్రంగా ఉండాలని భావిస్తోందని, దేశంలో ఉనన భారతీయ సైనికులు విడిచి వెళ్లాలని మయిజ్జు చెప్పాడు. ఎన్నికల ప్రచార సమయంలో మయిజ్జు తాను గెలిస్తే మాల్దీవుల్లో భారత దళాలు లేకుండా చేస్తామని ఆయన అన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు ఇజ్రహీం సోలిహ్ దేశ సార్వభౌమాధికారాన్ని ఇండియాకు తాకట్టు పెట్టారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా బ్లూమ్ బర్గ్ టవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత వ్యతిరేకతను ప్రదర్శించారు. భారతీయ సైనికులే కాదు, మరే ఇతర దేశాలకు చెందిన సైనికులైన తమ స్పందన ఇలాగే ఉంటుందని అన్నారు.
Read Also: China: మటన్ పేరు చెప్పి పిల్లి మాంసం అమ్ముతున్న చైనా
మాల్దీవుల్లో ప్రస్తుతం 70 మంది భారతీయ సైనిక సిబ్బంది ఇండియా ఇచ్చిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాలను నిర్వహిస్తున్నారు. భారత యుద్ధనౌకలు మాల్దీవుల్లోని ప్రత్యేక ఆర్థిక జోన్ లో గస్తీకి సాయపడుతున్నాయి. సైనిక ఉనికిని తొలగించేందుకు ఇప్పటికే తాను చర్చల్ని ప్రారంభించానని మయిజ్జు తెలిపారు. భారతీయ సైనికుల స్థానంలో ఇతర దేశాల సైనికులు ఇక్కడికి రారని, చైనా లేదా మరేదైనా దేశానికి చెందిన సైనికులను అనుమతించబోమన్నారు.
ఆసియాలో కీలక శక్తులుగా ఉన్న భారత్, చైనాలు మాల్దీవులపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నాయి. పాత అధ్యక్షుడు ఇజ్రాహీం సోలెహ్ ఇండియాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. రెండు దేశాలు కూడా మాల్దీవుల్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా చైనా, ఇండియా కేంద్రంగా ప్రచారం జరిగింది. కేవలం 5 లక్షల జనాభా ఉన్న ద్వీప దేశం ఇటు భారత్, అటు చైనాకు కీలకంగా మారింది. కొత్తగా ఎన్నికైన మయిజ్జు నవంబర్ 15న పదవీ బాధ్యతలు తీసుకోనున్నారు.