NTV Telugu Site icon

Kshama Sawant: ఇండో అమెరికన్‌ నేత క్షమా సావంత్‌కు ఎమర్జెన్సీ వీసా తిరస్కరించిన భారత్‌!

Kshamasawant

Kshamasawant

అమెరికాలోని సియాటెల్‌లో ఉన్న భారత కాన్సులేట్‌లో భారతీయ-అమెరికన్ రాజకీయ నాయకురాలు క్షమా సావంత్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. అత్యవసర వీసా నిరాకరించడంతో సియాటిల్‌లోని భారత కాన్సులేట్ శాంతిభద్రతల సమస్యను ఎదుర్కొంది. కొంతమంది వ్యక్తులు కార్యాలయ సమయం తర్వాత అనుమతి లేకుండా కాన్సులేట్ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించి, బయటకు వెళ్లడానికి నిరాకరించడంతో సంబంధిత స్థానిక అధికారులను పిలవవలసి వచ్చిందని సియాటిల్ లోని భారత కాన్సులేట్ జనరల్ తెలిపింది.

‘‘ఈరోజు కొంతమంది వ్యక్తులు కార్యాలయ సమయం తర్వాత కాన్సులేట్ ప్రాంగణంలోకి అనధికారికంగా ప్రవేశించడం వల్ల తలెత్తిన శాంతిభద్రతల పరిస్థితిని కాన్సులేట్ ఎదుర్కోవలసి వచ్చింది. పదే పదే అభ్యర్థించినప్పటికీ ఈ వ్యక్తులు కాన్సులేట్ ప్రాంగణాన్ని వదిలి వెళ్ళడానికి నిరాకరించారు. కాన్సులేట్ సిబ్బందితో దూకుడుగా మరియు బెదిరింపులకు పాల్పడ్డారు.’’ అని సియాటిల్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొంది.

క్షమా సావంత్.. సియాటిల్ నగర కౌన్సిల్ మాజీ సభ్యురాలు. ఇదే వ్యవహారంపై ఆమె సోషల్ మీడియాలో స్పందించారు. తిరస్కరణ జాబితాలో తన పేరు ఉందని పేర్కొంటూ వీసా నిరాకరించారన్నారు. ఈ క్రమంలోనే మూడుసార్లు తన వీసా నిరాకరించినందుకు గల కారణాలు తెలపాలంటూ తన మద్దతుదారులతో కలిసి భారత కాన్సులేట్‌ ముందు శాంతియుతంగా నిరసన చేపట్టామన్నారు. క్షమా సావంత్‌కు భారత్‌ వీసా నిరాకరించడం ఇదే తొలిసారి కాదు. బెంగళూరులో ఉంటున్న ఆమె తల్లి దగ్గరకు వెళ్లేందుకు సావంత్‌ గతంలో ప్రయత్నించినప్పటికీ వీసా మంజూరు కాలేదు. ఆమె భర్త కాల్విన్‌ ప్రీస్ట్‌కు మాత్రం వీసా లభించడం విశేషం.