NTV Telugu Site icon

Natasha Perianayagam: ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా భారతీయ-అమెరికన్

Natasha

Natasha

Natasha Perianayagam: భారతీయ-అమెరికన్ విద్యార్థిని నటాషా పెరియనాయగం(13) అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే తెలివైన విద్యార్థినిగా వరసగా రెండో ఏడాది మొదటిస్థానంలో నిలిచింది. జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ నిర్వహించిన సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్(సీవైటీ) పరీక్షల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచారు నటాషా. 76 దేశాల్లోని 15,000 మంది ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. కేవలం 27 శాతం కంటే తక్కువ మంది ఈ పరీక్షల్లో అర్హత సాధించారు. వీరిలో నటాషా తొలిస్థానంలో నిలిచారు.

న్యూజెర్సీలోని ఫ్లోరెన్స్ స్కూల్ లో చదువుతున్న నటాషా..2021లో గ్రేడ్ 5 విద్యార్థినిగా ఉన్నప్పుడు ఈ పరీక్షలకు హాజరై తొలిస్థానంలో నిలిచింది. ఐదో తరగతి చదవుతున్న నటాషా 8వ తరగతి స్థాయి ప్రతిభ కనబరిచి వెర్బల్, క్వాంటిటేటివ్ విభాగాల్లో 90వ శాతాన్ని సాధించింది. తాజాగా ఈ ఏడాది నిర్వహించిన స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్(ఎస్ఏటీ), ఏటీ పరీక్షల్లో మరోసారి తన ప్రతిభను చాటుకుని తొలిస్థానంలో నిలిచింది.

తమిళనాడు చెన్నైకి చెందిన నటాషా తల్లిదండ్రులు వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. ఇది కేవలం ఒక పరీక్ష, విద్యార్థులు సాధించిన విజయానికి గుర్తింపు మాత్రమే కాదని.. వారి ఆవిష్కరణ, విద్యపై వారికి ఉన్న ప్రేమ, చిన్నతనంలోనే వారు సంపాదించిన జ్ఞానానికి సంబంధించిందని.. సీవైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అమీ షెల్టాన్ అన్నారు.