BrahMos Deal: సౌత్ చైనా సీలో ఆధిపత్యం ప్రదర్శిస్తూ పొరుగు దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తున్న చైనాకు దిమ్మతిరిగే కౌంటర్ పడబోతోంది. డ్రాగన్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఫిలిప్పీన్స్ తన సైనిక బలగాలను ఊహించని రీతిలో సన్నద్ధం చేస్తోంది. ఇందుకోసం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన భారత సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ‘బ్రహ్మోస్’ను భారీ సంఖ్యలో మోహరించేందుకు రంగం సిద్ధమైంది. భారత్ – ఫిలిప్పీన్స్ మధ్య జరుగుతున్న రెండో విడత బ్రహ్మోస్ కొనుగోళ్ల చర్చలు తుది దశకు చేరుకున్నాయి. దాదాపు రూ.7,100 కోట్ల (800 మిలియన్ డాలర్లు) భారీ వ్యయంతో 60 అత్యాధునిక క్షిపణులు, 5 సరికొత్త బ్రహ్మోస్ లాంచ్ సిస్టమ్స్‌ను కొనుగోలు చేసేందుకు మనీలా డీల్ ఖరారు చేసుకుంటోంది.
ఇప్పటికే 2022లో ఫిలిప్పీన్స్ దాదాపు 375 మిలియన్ డాలర్లతో భారత బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసి తమ నావికాదళంలో చేర్చింది. అయితే సౌత్ చైనా సీలో చైనా యుద్ధనౌకలు నిరంతరం చొరబాట్లకు పాల్పడుతుండటంతో తీరప్రాంత రక్షణను మరింత పటిష్టం చేసుకోవాలని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ గట్టి నిర్ణయం తీసుకున్నారు. గత డీల్ కంటే రెండింతలు పెద్దదైన ఈ తాజా ఒప్పందంలో.. ఫిలిప్పీన్స్ తన ఆపరేషనల్ అవసరాలకు తగినట్లుగా ప్రత్యేక మార్పులు చేయాలని కోరినట్లు సమాచారం.
భారత్, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్. ధ్వని కంటే దాదాపు 3 రెట్ల వేగంతో (Mach 2.8 to 3) దూసుకెళ్లే దీనిని గాల్లో అడ్డుకోవడం ప్రస్తుతానికి ఏ శత్రు రక్షణ వ్యవస్థకూ సాధ్యం కాదు. సముద్రంలో ఉండే అతిపెద్ద యుద్ధనౌకలనైనా, తీరప్రాంత బంకర్లనైనా క్షణాల్లో ధ్వంసం చేయగల కచ్చితత్వం దీని సొంతం. గత ఏడాది భారత్ తన సైనిక ఆపరేషన్లలో బ్రహ్మోస్‌ను ఉపయోగించిన తీరు ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగ నిపుణులను ఆశ్చర్యపరిచింది. ఈ ప్రదర్శన తర్వాతే అంతర్జాతీయంగా బ్రహ్మోస్‌కు డిమాండ్ అమాంతం పెరిగింది.
ఒకప్పుడు ఆయుధాల దిగుమతులపై ఆధారపడిన భారతదేశం, ఇప్పుడు గ్లోబల్ డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్‌లో రికార్డులు సృష్టిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే భారత రక్షణ ఎగుమతులు ఏకంగా 62 శాతం పెరిగి రూ.38,424 కోట్ల చారిత్రక రికార్డును తాకాయి. ఫిలిప్పీన్స్‌తో పాటు ఇండోనేషియా, వియత్నాం కూడా ఇప్పటికే బ్రహ్మోస్ కొనుగోళ్లకు ఒప్పందాలు కుదుర్చుకోగా.. యూఏఈ, థాయ్‌లాండ్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వంటి దేశాలు భారత్‌తో చర్చలు జరుపుతున్నాయి. సౌత్ చైనా సీని తన సొంత చెరువుగా భావిస్తున్న చైనాకు.. ఫిలిప్పీన్స్ తీరంలో మోహరించబోయే భారత బ్రహ్మోస్ క్షిపణులు సిసలైన సింహస్వప్నంగా మారనున్నాయి. ఈ వ్యూహాత్మక డీల్‌తో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అధికార సమతుల్యత ఒక్కసారిగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

