Jaishankar: దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనా దుందుడుకు వేషాలు ఇతర దేశాలకు ఇబ్బందికరంగా మారింది. ఈ ప్రాంతంలో సర్వాధికారాలు మావే అంటూ ఫిలిప్పీన్స్, బ్రూనై, వియత్నాం వంటి దేశాలను చైనా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇటీవల రెండు సందర్భాల్లో ఫిలిప్పీన్స్ నౌకలపై చైనా కోస్టుగార్డ్స్ నౌకలు దాడి చేశాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది. ఈ ప్రాంతంతో మిత్రదేశం ఫిలిప్పీన్స్‌కి అండగా నిలుస్తామని ఇప్పటికే అమెరికా ప్రకటించింది. చైనా వైఖరిని ఖండించింది.
Read Also: Youtube: ఇండియాలో 2.25 మిలియన్ల వీడియోలను తొలగించిన యూట్యూబ్..
ఇదిలా ఉంటే ఫిలిప్పీన్స్ సార్వభౌమత్వానికి మద్దతు ఇస్తామని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. రక్షణ, భద్రత సహా అనేక రంగాల్లో ఆ దేశంతో సహకరానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఫిలిప్పీన్స్ పర్యటనలో ఉన్న జైశంకర్ అక్కడి విదేశాంగ మంత్రి ఎన్‌రిక్ మనాలో తో భేటీ అయ్యారు. సముద్ర చట్టాలను అన్ని దేశాలు పాటించాలని కోరారు. దక్షిణ చైనా సముద్రంలో ప్రస్తుత పరిణామాల నడుమ ఫిలిప్పీన్స్‌తో రక్షణ సహకారాన్ని విస్తరించేందుకు భారత్ చర్యలు తీసుకుంటుందా.?? అనే ప్రశ్నకు సమాధానంగా.. ఈ అంశాన్ని వేరుగా చూడాలని, ప్రస్తుత పరిస్థితులతో దీన్ని ముడిపెట్టొద్దని జైశంకర్ అన్నారు. రెండు దేశాలు ప్రజాస్వామ్య దేశాలని, అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉన్నాయని, మారుతున్న ప్రపంచంలో పరస్పర సహకారాన్ని మరింతి పెంపొందించుకోవడం చాలా అవసరమని, ప్రతీ దేశానికి దాని సార్వభౌమత్వాన్ని కాపాడుకునే హక్కు ఉందన్నారు.
చైనా, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో జైశంకర్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అయితే, ఈ అంశంపై చైనా కూడా స్పందించింది. దక్షిణ చైనా సముద్రంలో తమ సార్వభౌమాధికారాన్ని కూడా గౌరవించాలని భారత్‌ని చైనా కోరింది. రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాల్లో మూడో దేశం జోక్యం తగదని చైనా విదేశాంగ ప్రతినిధి లిన్ జియాన్ అన్నారు. సముద్ర వివాదాల విషయంలో వాస్తవం తెలుసుకోవాలని, మా సార్వభౌమత్వం, సముద్ర ప్రయోజనాలను గౌరవించాలని, ఇక్కడ శాంతి-స్థిరత్వం స్థాపనకు ప్రాంతీయ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను గుర్తించాలని అతను వ్యాఖ్యానించారు.
