Site icon NTV Telugu

India-Iran: ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం తాజా హెచ్చరికలు ఇవే!

Iran

Iran

ఇరాన్‌లోని భారతీయులకు మరోసారి కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. భూ సరిహద్దుల ద్వారా ఇరాన్ దాటి వెళ్లొద్దని సూచించింది. తమకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా లేదా తమతో సమన్వయం చేసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ సరిహద్దును దాటే ప్రయత్నం చేయొద్దని స్థానిక భారత రాయబార కార్యాలయం విజ్ఞప్తి చేసింది.

ప్రస్తుత పరిస్థితుల్లో భూసరిహద్దుల గుండా స్వయంగా ప్రయాణించే వారు ఇమ్మిగ్రేషన్, డాక్యుమెంటేషన్ వంటి అనేక సమస్యలను ఎదుర్కొనే అవకాశముందని రాయబార కార్యాలయం హెచ్చరించింది. ఎవరు అయినా దేశం విడిచి వెళ్లే ముందు తప్పనిసరిగా టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి సూచనలు తీసుకోవాలని సూచించింది.

రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో.. ‘‘ఇరాన్‌లో ఉన్న భారతీయులు ముందస్తు అనుమతి, స్పష్టమైన సమన్వయం లేకుండా భూసరిహద్దు దాటే ప్రయత్నం చేయకూడదు.’’ అని పేర్కొంది. ఎంబసీకి తెలియకుండా సరిహద్దు ప్రాంతాలకు వెళ్లే వారు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. ఇమ్మిగ్రేషన్ అనుమతులు, పక్క దేశాల్లో ప్రవేశానికి అవసరమైన డాక్యుమెంట్లు, సరిహద్దు చెక్‌పోస్టుల దగ్గర ఉండే నియమాలు వంటి అంశాలు సమస్యలకు దారితీయవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఎంబసీతో సమన్వయం లేకుండా దేశం బయటకు వెళ్లినట్లయితే ఆ తర్వాత తలెత్తే సమస్యల్లో సహాయం చేయడం కష్టమవుతుందని కూడా స్పష్టం చేసింది.

ఇరాన్‌లో ఉన్న భారతీయులు అధికారిక సమాచార మార్గాల ద్వారా రాయబార కార్యాలయంతో అనుసంధానంగా ఉండాలని, తాజా సూచనలను పాటించాలని అధికారులు కోరారు. విదేశాల్లో భద్రత, ప్రయాణ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నప్పుడు పౌరుల రక్షణ కోసం ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తారని తెలిపారు. కాబట్టి ఇరాన్‌లో ఉన్న భారతీయులు స్వతంత్రంగా భూసరిహద్దుల వైపు ప్రయాణం చేయకుండా.. ముందుగా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి సూచనలు తీసుకున్న తర్వాత మాత్రమే ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Exit mobile version