Site icon NTV Telugu

Indeed Layoff: 2 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న ఇండీడ్..

Indeed

Indeed

Indeed Layoff: అమెరికాకు చెందిన ప్రముఖ జాబ్ సెర్చ్ ప్లాట్‌ఫామ్ ఇండీడ్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. టెక్ లేఆఫ్స్ జరుగుతున్న ప్రస్తుతం కాలంలో తాము కూడా 2,200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. అంటే కంపెనీ నుంచి 15 శాతం ఉద్యోగులను తొలగించనుంది. సీఈఓ క్రిస్ హైమ్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇండీడ్ లో మొత్తం 14,600 మంది ఉద్యోగులు ఉన్నారు. దాదాపుగా అన్ని విభాగాల నుంచి కోతలు ఉండనున్నట్లు తెలుస్తోంది.

Read Also: Media persons Protection Bill: జర్నలిస్టుల రక్షణకు బిల్లు తీసుకువచ్చిన ఛత్తీస్‌గఢ్

కోవిడ్ మహమ్మారి పరిణామాలు, ఆర్థిక మాంద్యం భయాలతో పలు అమెరికా కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఇండీడ్ కూడా చేరింది. దాదాపుగా అమెరికాలోని అన్ని ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. అమెజాన్, మెటా, ట్విట్టర్, గూగుల్, ఇంటెల్, డెల్, మైక్రోసాఫ్ట్, మార్వెల్ టెక్నాలజీస్, టైసన్ ఫుడ్స్, లాక్‌హీడ్ మార్టిన్, సిటీ గ్రూప్, జనరల్ మోటార్స్, ఎరిక్సన్, యాహూ, డిస్నీ, ఈబే, జూమ్, బోయింగ్, ఫెడ్ ఎక్స్, ఫిలిప్స్, ఐబీఎం, సాప్, స్పోర్టిఫై ఇలా ప్రముఖ సంస్థలు తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొంత మందిని తీసేశాయి.

ఆర్థికమాంద్యం, ఆర్థిక మందగమనం కారణంగా పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఖర్చులను తగ్గించుకోవాలనే ఆలోచనతో ఇలా చేస్తున్నాయి. జనవరిలో మైక్రోసాఫ్ట్ 10,000 మంది, 5 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అమెజాన్ కూడా 18,000 మందిని తొలగించింది. మెటా గతేడాది చివర్లో 11,000 ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఇటీవల యాహూ కూడా 20 శాతం సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ట్విట్టర్ 50 శాతం మందిని తొలగించింది.

Exit mobile version