Israel: ఇజ్రాయిల్ శత్రువులుగా భావిస్తున్న ఇద్దరు కేవలం 12 గంటల వ్యవధిలోనే హతమార్చబడ్డారు. టెహ్రాన్‌లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యాడు. దీనికి కొన్ని గంటల ముందు లెబనాన్ నుంచి పనిచేస్తున్న హిజ్బుల్లా కమాండర్ ఫువాద్ షుక్ర్ బీరూట్‌లో చంపబడ్డాడు. ఇలా ఎవరినైనా, ఎక్కడనైనా తమ శత్రువులని భావిస్తే చంపడం ఇజ్రాయిల్‌కి వెన్నతో పెట్టిన విద్య అని నిపుణులు చెబుతున్నారు. పాలస్తీనాకు గట్టి మద్దతుదారులుగా ఉన్న హమాస్, హిజ్బుల్లాకు చెందిన ఇద్దరు కీలక వ్యక్తుల్ని గంటల వ్యవధిలో చంపడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామం ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం మధ్యప్రాచ్యంలో పూర్తిస్థాయి సంఘర్షణగా మారొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Read Also: Ismail Haniyeh: హమాస్ చీఫ్ హనియే హత్యలో మా ప్రమేయం లేదు: అమెరికా..
ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణస్వీకారానికి వెళ్లిన సమయంలో రాజధాని టెహ్రాన్‌లో హనియే హత్యకు గురయ్యాడు. లెబనాన్ రాజధాని బీరూట్‌లో హిజ్బుల్లా కమాండర్ ఫువాద్ షుక్ర్ ని ఇజ్రాయిల్ హతమార్చింది. ఫువాద్‌ని హతమార్చింది తామే అని ఇజ్రాయిల్ వైమానిక దళం బాధ్యత వహిస్తున్నప్పటికీ, హనియే మరణంపై మాత్రం ఇజ్రాయిల్ తమ ప్రమేయం లేదని చెబుతోంది.
అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని హతమార్చడమే కాకుండా 200కి పైగా ఇజ్రాయిల్ పౌరుల్ని బందీలుగా పట్టుకుంది. అప్పటి నుంచి ఇజ్రాయిల్-హమాస్ మధ్య గాజా యుద్ధం ప్రారంభమైంది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పలు సందర్భాల్లో హమాస్ నాయకులు ఎక్కడ ఉన్నా నిర్మూలిస్తామని చెప్పింది. ఇందుకు గూఢచార సంస్థ మొస్సాద్‌కి కూడా నెతన్యాహూ నుంచి ఆర్డర్స్ వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే హనియే హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడి వెనక ఇజ్రాయిల్ ఉందని ఇరాన్ ఆరోపిస్తూ, దానికి ప్రతీకారం ఉంటుందని హెచ్చరించింది.