Historic Nuclear Fusion Breakthrough Announced: శాస్త్రవేత్తలు ఎన్నో దశాబ్ధాలుగా కేంద్రక సంలీన చర్య కోసం ప్రయత్నిస్తున్నారు. ఇది కనుక సాధ్యం అయితే క్లీన్ ఎనర్జీ, తక్కువ రేడియేషన్ కలిగిన ఎనర్జీని ఉత్పత్తి చేయవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా చారిత్రాత్మక న్యూక్లియర్ ప్యూజన్ బ్రేక్ త్రూని ప్రకటించారు శాస్త్రవేత్తలు. యూఎస్ఏ కాలిఫోర్నియాలోని లారెన్స్ లివర్‌మోర్ నేషనల్ లాబొరేటరీ (ఎల్‌ఎల్‌ఎన్‌ఎల్) ఈ నెలలో నిర్వహించిన ఒక ప్రయోగంలో కేంద్ర సంలీన చర్యను నడిపించేందుకు అవసరం అయిన లేజర్ శక్తి కన్నా ఎక్కువ శక్తి ఉత్పత్తి అయిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.
న్యూక్లియర్ ఫ్యూజర్(కేంద్రక సంలీనం)వల్ల భవిష్యత్తులో అపరిమిత, స్వచ్ఛమైన శక్తికి ఇది ముందడుగు కానుంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించే అవకాశం ఏర్పడింది. దీన్ని మైల్ స్టోన్ విక్టరీగా యూఎస్ పరిశోధకులు మంగళవారం ప్రకటించారు. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ ప్యూజన్ ఇగ్నిషన్ ను అతిముఖ్యమైన శాస్త్రీయ పురోగతిగా అభివర్ణించింది. ఇది దేశ రక్షణలో పురోగతికి, భవిష్యత్తులో స్వచ్ఛమైన శక్తికి దారి తీస్తుందని అన్నారు. అత్యంత ముఖ్యమైన శాస్త్రీయ సవాళ్లలో ఒకటని దీన్ని అభివర్ణించింది.
Read Also: BRS Party: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై బీఆర్ఎస్ గురి..!
న్యూక్లియర్ ఫ్యూజన్ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు దశాబ్ధాలుగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. డిసెంబర్ 5న లారెన్స్ లివర్‌మోర్ నేషనల్ లాబొరేటరీ మొదటిసారిగా నియంత్రిత ఫ్యూజన్ ప్రయోగాన్ని నిర్వహించింది. దీంట్లో ‘‘సైంటిఫిక్ ఎనర్జీ బ్రేక్ ఈవెన్’’ సాధించినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.
కేంద్రక సంలీనం ప్రాముఖ్యత:
కేంద్రక సంలీనం చర్య సూర్యుడు, ఇతర నక్షత్రాల్లో జరుగుతుంది. దీని వల్ల అపరిమిత శక్తి విడుదల అవుతుంది. దీంతో పాటు తక్కువ స్థాయిలో రేడియేషన్ విడుదల అవుతుంది. న్యూక్లియర్ ఫ్యూజన్(కేంద్రక సంలీనం) చర్యలో రెండు తేలికపాటి హైడ్రోజన్ అణువులు కలిసి ఒక పెద్ద హైడ్రోజన్ అణువును ఏర్పరుస్తాయి. దీంట్లో చాలా శక్తి విడుదల అవుతుంది. భూమిపై కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో హైడ్రోజన్ ను అధిక ఉష్ణోగ్రతకు గురిచేయడం వల్ల కేంద్రక సంలీనం సాధ్యం అవుతుంది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని నూక్లియర్ పవర్ ప్లాంట్లలో న్యూక్లియర్ ఫిజన్( కేంద్రక విచ్ఛత్తి) చర్యను ఉపయోగిస్తున్నారు. దీంట్లో ఒక రేడియో యాక్టివ్ అణువును విచ్చత్తి చేయడం ద్వారా శక్తి జనిస్తుంది. కేంద్రక సంలీనంతో పోలిస్తే.. కేంద్రక విచ్చత్తిలో విడుదలయ్యే శక్తి చాలా తక్కువ. పైగా కేంద్రక విచ్ఛత్తిలో రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది.