Israel-hamas War: గత శనివారం ఇజ్రాయిల్ పై పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులు దారుణ దాడికి పాల్పడ్డారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే 5000 రాకెట్లను ప్రయోగించారు. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే గాజా నుంచి ఇజ్రాయిల్ లోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు సామాన్య ప్రజలపై విరుచుకుపడ్డారు. గాజాకు సరిహద్దుల్లో ఉన్న ఇజ్రాయిల్ కిబ్బుట్జ్‌లో మారణహోమాన్ని సృష్టించారు. హమాస్ దాడుల్లో ఇజ్రాయిల్ వైపు 1200 మందికి పైగా మరణించగా.. 150 మందిని ఉగ్రవాదులు బందీలుగా పట్టుకుని గాజా ప్రాంతానికి తీసుకెళ్లారు. మరోవైపు గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో వేల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఇప్పటి వరకు యుద్ధంలో 3200 మంది మరణించారు.
ఇదిలా ఉంటే ఒక్క హమాస్ ఉగ్రవాదుల నుంచి గాజా వైపు నుంచే కాకుండా ఉత్తరాన ఉన్న లెబనాన్ నుంచి కూడా ఇజ్రాయిల్ దాడుల్ని ఎదుర్కొంటోంది. ఇరాన్ మద్దతు ఉన్న లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా కూడా తాము ఇజ్రాయిల్ పై యుద్ధం చేస్తామని ప్రకటించింది. సరైన సమయం వచ్చినప్పుడు ఇజ్రాయిల్ తో జరిగే యుద్ధంలో హమాస్ తో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్ నయీమ్ కస్సెమ్ శుక్రవారం సంచలన ప్రకటన చేశారు.
Read Also: India vs Pakistan Match Live Updates: దాయాదుల సమరం లైవ్ అప్‌డేట్స్..
పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గాజా స్ట్రిప్‌లోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయిల్ చేసిన వైమానిక దాడుల్లో 1900 మంది చనిపోయారు. ఇందులో 600 మందికి పైగా పిల్లలు ఉన్నట్లు తెలిపింది. లెబనాన్ రాజధాని బీరూట్ లో పాలస్తీనాకు అనుకూలంమగా జరిగిన ర్యాలీలో ఖస్సెమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం, సమయం వచ్చినప్పుడు యుద్ధంలో చేరుతామని అన్నారు. ప్రధానంగా అరబ్ దేశాలు, ఐక్యరాజ్యసమితి, ఇతర దేశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా జోక్యం చేసుకోవద్దని మమ్మల్ని కోరినా, మా నిర్ణయాన్ని ప్రభావితం చేయదని హిజ్బుల్లా చీఫ్ వెల్లడించారు.
శుక్రవారం బీరూట్‌లో 1000 మందికి పైగా హిజ్బుల్లా మద్దతుదారులు పాలస్తీనా జెండాను పట్టుకుని వారికి సంఘీభావంగా ర్యాలీలు చేశారు. మరోవైపు ఇజ్రాయిల్ దక్షిణ లెబనాన్ పై జరిపిన దాడుల్లో రాయిటర్స్ జర్నలిస్టు మరణించాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. బుధవారం లెబనాన్ గ్రామం దైరా సమీపంలో ఉన్న ఇజ్రాయిల్ స్థావరాన్ని హిజ్బుల్లా లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది.