NTV Telugu Site icon

Hamas: ఇరాన్ , హిజ్బుల్లా మద్దతు కోసం అక్టోబర్ 07 దాడి ఆలస్యం.. 9/11 తరహా దాడులకు ముందుగా ప్లాన్..

Hamas Attack On Israel

Hamas Attack On Israel

Hamas: హమాస్ అక్టోబర్ 07, 2023 దాడికి ఏడాది ముందు నుంచే ప్లాన్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. దాడుల కోసం హమాస్ మిలిటరీ, పొలిటికల్ నాయకుడు దాదాపుగా రెండేళ్ల పాటు వరసగా సమావేశాలు నిర్వహించారు. గతేడాది అక్టోబర్ 07 నాటి దాడిలో హమాస్, దక్షిణ ఇజ్రాయిల్‌లోకి ప్రవేశించి 1200 మందిని చంపింది. 251 మందిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత నుంచి ఇజ్రాయిల్ హమాస్‌పై విరుచుకుపడుతోంది. గాజాలో దాడుల్లో ఇప్పటి వరకు 40 వేలకు పైగా మంది మరణించారు.

నిజానికి హమాస్ అంతకుముందు ఏడాదే అక్టోబర్07 తరహా దాడులు చేయాలని ప్లాన్ చేసింది. అయితే, ఇరాన్ హిజ్బుల్లా సాయం పొందాలని కోరడంతో ప్లాన్ ఆలస్యం అయింది. రెండేళ్ల పాటు హమాస్ కీలక నాయకులు వరసగా చర్చలు జరిపారు.ఈ ఏడాది జనవరిలో ఖాన్ యూనస్‌లోని హమాస్ కంట్రోల్ సెంటర్‌లోని కంప్యూటర్ నుంచి సేకరించిన వివరాల్లో ఈ వివరాలు ఉన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ వెల్లడించింది.

న్యూయార్క్ టైమ్స్ శనివారం వెల్లడించిన కథనం ప్రకారం.. జనవరి 2022 నుంచి ఆగస్టు 2023 వరకు జరిగిన 10 హమాస్ సమావేశాల గురించి వివరించింది. ఈ సమావేశాల్లో ఇరాన్ ప్రమేయం, ఫండింగ్‌కి సంబంధించిన వివరాలు ఉన్నట్లు తెలిసింది. అయితే, హమాస్ నుంచి ఏ నాయకులు హాజరైన వివరాలు స్పష్టంగా తెలియనప్పటికీ, ప్రస్తుత హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మాత్రం అన్ని సమావేశాలకు హాజరైనట్లు తెలుస్తోంది. చనిపోయిన మహ్మద్ డెయిఫ్, మర్వాన్ ఇస్సా, మహ్మద్ సిన్వార్ చాలా సమావేశాలకు హాజరైనట్లు నివేదిక పేర్కొంది. యాహ్యా సిన్వార్ 500 మిలియన్ డాలర్ల నిధులను కోరాడని, దీనిని పవిత్ర యుద్ధానికి ఉపయోగిస్తానని చెప్పాడని సమాచారం.

Read Also: Alai Balai Program: మాట నిలబెట్టుకున్నారు.. సీఎం రేవంత్ కు గొంగడి కర్ర బహుకరించిన దత్తాత్రేయ..

ప్రణాళికలో భాగంగా హమాస్ ఇజ్రాయిల్ సైనిక సదుపాయాలు, పౌరులపై దాడికి ప్లాన్ చేసింది. “ఈ పవిత్రమైన లక్ష్యాన్ని సాధించడానికి మమ్మల్ని తీసుకెళ్లే వరకు మేము ఒక్క నిమిషం లేదా పైసా వృధా చేయబోమని మేము మీకు వాగ్దానం చేస్తున్నాము” అని సిన్వార్ జూన్ 2021 నాటి ఒక లేఖలో పేర్కొన్నాడని నివేదిక తెలిపింది. ది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. హమాస్ మిలిటరీ వింగ్ 10 మిలియన్ డాలర్ల కేటాయింపును ఇరాన్ అధికారి ధృవీకరించిన లేఖను ఉటంకిస్తూ నివేదించింది. సిన్వార్ తర్వాత అదనంగా $500 మిలియన్లను కోరినట్లు నివేదించబడింది, ఇది రెండు సంవత్సరాలలో డెలివరీ చేయబడుతుందని అతను చెప్పాడు, నెలకు $20 మిలియన్లు బదిలీ చేయబడతాయని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.

జనవరి 2022లో జరిగిన సమావేశం తర్వాత, మహాస్ అదే ఏడాది ఏప్రిల్, జూన్‌లో పెద్ద దాడి చేయాలని సుదీర్ఘంగా చర్చింది. షాపింగ్ మాల్స్, మిలిటరీ కామాండ్ సెంటర్ల, టెల్ అవీవ్‌లో అజ్రీలీ టవర్లపై దాడి చేయాలని అనుకున్నారు. న్యూయార్క్‌ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై 9/11 దాడుల తరహాలోనే దాడులు చేయాలని భావించింది. అయితే, టవర్లను కూల్చే సామర్థ్యం తకము లేదని నిర్ధారించడంతో ఈ ప్రణాళికను అమలు చేయలేదు. ఆ తర్వాత 2022 సెప్టెంబర్‌లో ఇజ్రాయిల్ మిలిటరీ సదుపాయాలపై దాడులు చేయాలని ప్లాన్ చేసింది. అయితే, మళ్లీ వెనక్కి తగ్గింది. దీనికి నిధులు, ఇరాన్, హిజ్బుల్లా మద్దతు కారణంగా తెలిసింది.

2023 ఆగస్టులో హమాస్ డిప్యూటీ లీడర్ ఖలీల్ అల్ హయ్యా, ఇరాన్ రివల్యూషనరీ గార్డస్ కార్ఫ్స్ సీనియర్ నాయకుడు మహ్మద్ సైద్ ఇజాదీ లెబానాన్‌లో సమావేశమయ్యారని నివేదిక తెలిపింది. దాడి ప్రారంభమైన మొదటి గంటలోనే ఇజ్రాయిల్ టార్గెట్లను నాశనం చేయాల్సిన అవసరం కోసం హమాస్ ఇరాన్‌ని సాయం కోరింది. అయితే, ఇరాన్ హమాస్ ప్లాన్‌ని స్వాగతించింది, అదే సమయంలో తమకు టైమ్ కావాలని కోరినట్లు తెలిసింది. చివరకు హమాస్ ఇరాన్, హిజ్బుల్లా ప్రత్యక్ష సాయం లేకుండానే అక్టోబర్ 07 ఉదయం ఇజ్రాయిల్‌పై దాడి చేసింది. ఇది గాజా యుద్ధానికి కారణమైంది. ఏడాదిగా యుద్ధం కొనసాగుతూనే ఉంది.