Site icon NTV Telugu

H-1B Impact On Indians: H-1B వీసాలు, గ్రీన్ కార్డ్ వ్యవస్థలో మార్పులు.. భారతీయులపై తీవ్ర ప్రభావం!

H1b Visa

H1b Visa

H-1B Impact On Indians: H-1B వీసా ప్రోగ్రాంను “మోసం” (Scam)గా అభివర్ణించారు అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లూట్నిక్. ఈ వీసాల కారణంగా అమెరికన్ ఉద్యోగులకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్నారు. దీంతో పాటు వీసా వ్యవస్థలో సంస్కరణలు చేసేందుకు సిద్ధమవుతోందని స్పష్టం చేశారు. ప్రస్తుతం H-1B వీసా దారుల్లో అధిక శాతం భారతీయులే ఉండటం వల్ల ఈ మార్పులతో అనేక మందిపై తీవ్ర ప్రభావం చూపేంచే అవకాశం ఉంది.

Read Also: TG Rains: ముసురుతో వణుకుతున్న హైదరాబాద్.. నేడు ఆరెంజ్ అలెర్ట్ జారీ

H-1B వీసాపై విమర్శలు
ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లూట్నిక్ మాట్లాడుతూ.. ప్రస్తుత H-1B వీసా వ్యవస్థ ఒక ఫ్రాడ్.. ఇది అమెరికన్ ఉద్యోగాలను పక్కన పెట్టి విదేశీయులతో భర్తీ చేస్తోంది అన్నారు. ప్రతి అమెరికన్ కంపెనీకి మన దేశ కార్మికులకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. అలాగే, ప్రస్తుత లాటరీ విధానం స్థానంలో వేతన ఆధారిత (wage-based) విధానాన్ని ప్రవేశ పెట్టే యోచనలో ఉన్నామని వెల్లడించారు.

గ్రీన్ కార్డు వ్యవస్థపై విమర్శలు
ప్రస్తుతం గ్రీన్ కార్డు వ్యవస్థను కూడా లూట్నిక్ తీవ్రంగా తప్పుబట్టారు. అమెరికన్ల సగటు ఆదాయం $75,000 ఉండగా, గ్రీన్ కార్డు పొందుతున్నవారి సగటు ఆదాయం $66,000 మాత్రమే ఉందన్నారు. ఇది సరైన పద్దతి కాదు.. తక్కువ స్థాయిలో ఉన్న వారిని ఎందుకు తీసుకుంటున్నాం? అని ప్రశ్నించారు. డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో నైపుణ్యం, ధనం ఉన్నవారికి ప్రాధాన్యం కల్పించే విధంగా వలస విధానం మారుతుందని యూఎస్ వాణిజ్య కార్యదర్శి లూట్నిక్ చెప్పుకొచ్చారు.

Read Also: Exploded Cylinder: జగద్గిరిగుట్టలో ఇంట్లో పేలిన సిలిండర్.. ఏడుగురికి తీవ్ర గాయాలు

‘గోల్డ్ కార్డ్’ ప్రణాళిక
అలాగే, కొత్తగా ప్రతిపాదనలో ఉన్న ‘గోల్డ్ కార్డ్’ గురించి కూడా వాణిజ్య కార్యదర్శి లూట్నిక్ వివరించారు. ఈ పథకం కింద కనీసం $5 మిలియన్ (సుమారు రూ. 40 కోట్లకు పైగా) పెట్టుబడి పెట్టే విదేశీయులకు అమెరికా శాశ్వత నివాస హక్కు (పర్మనెంట్ రెసిడెన్సీ) ఇవ్వాలని ప్రణాళికను తీసుకొచ్చాం.. ఇప్పటికే 2.5 లక్షల దరఖాస్తుదారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ పథకం అమలైతే అమెరికాకు సుమారు $1.25 ట్రిలియన్ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు.

భారత్‌పై ప్రభావం
H-1B వీసా వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేసినా మొదట అత్యధికంగా ప్రభావితమయ్యే దేశం భారతే.. 2023 ఆర్థిక సంవత్సరంలో ఆమోదించబడిన H-1B వీసాలలో 72 శాతం కంటే ఎక్కువ భారతీయులకే లభించాయి. చైనా వాటా కేవలం 11.7 శాతం మాత్రమే అని చెప్పాలి. ప్రస్తుతం H-1B వీసా కోటా 65,000 ఉండగా, అదనంగా 20,000 వీసాలు యూఎస్ లో ఉన్న అడ్వాన్స్‌డ్ డిగ్రీ హోల్డర్లకు కేటాయిస్తున్నారు. ఇవన్నీ లాటరీ పద్ధతిలోనే కేటాయించబడుతున్నాయి.

Exit mobile version