NTV Telugu Site icon

Ukrain Tension:భారతీయ విద్యార్ధులకు సూచన

ఉక్రెయిన్ – రష్యా ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఉక్రెయిన్ లో విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్ధులకు కేంద్రం పలు సూచనలు చేసింది. తాజా పరిణామాలతో ఉక్రెయిన్ లో వైద్యవిద్యను అభ్యసిస్తున్న వందలాది మంది తెలుగు విద్యార్ధులు. తల్లితండ్రులు ఆందోళనలో వున్నారు. ఉక్రెయిన్‌లో ఉండాల్సిన అవసరం లేని భారతీయ విద్యార్ధులు స్వదేశానికి తిరిగి రావాలని కేంద్రం సలహా ఇచ్చింది.

ఉక్రెయిన్ లోని భారతీయ విద్యార్ధులు భారత్ దౌత్యకార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. ఉక్రెయిన్ లోని భారత దౌత్యకార్యాలయం అన్ని సేవలు అందించేందుకు పని చేస్తూనే ఉంటుందని కేంద్ర విదేశాంగ పేర్కొంది. ఇదిలా వుంటే రష్యా, ఉక్రెయిన్‌ మధ్య 30 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదం ముదిరి పాకానపడింది. వైరం యుద్ధం అంచులకు చేరింది.ఉక్రెయిన్‌పై ముప్పేట దాడికి రష్యా రెడీ అయిందనే వార్తలు కలవరం కలిగిస్తున్నాయి.

రష్యా ఇప్పటికే లక్షన్నర మంది సైనికులను సరిహద్దుల్లో మోహరించింది. రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతగా ఫలితం మాత్రం కనిపించడంలేదని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. ఫిబ్రవరి 16 నే దాడికి రష్యా ముహూర్తం ఖరారు చేసిందని అమెరికా ప్రకటించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఉక్రెయిన్‌ పై దాడికి దిగితే తీవ్ర పరిణామాలు తప్పవంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ లో ఉన్నత విద్యను అభ్యసించే భారతీయ విద్యార్ధులు అప్రమత్తంగా వుండాలని మనదేశం కోరుతోంది.