NTV Telugu Site icon

Google Co-founder: విడాకులకు సిద్ధమైన మరో కుబేరుడు

Sergey Brin Google Co Founder

Sergey Brin Google Co Founder

విడాకులు తీసుకుంటున్న సంపన్న జంటల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌, అమెజాన్‌ ఛైర్మన్‌ జెఫ్‌ బెజోస్‌ బాటలోనే మరో కుబేరుడు భార్యతో తెగదెంపులకు సిద్ధమయ్యారు. ఇప్పుడు అదే బాటలో గూగూల్ సహ వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ (48)-నికోల్ షనాహన్‌ (37)జంట విడాకులకు సిద్ధమైంది. ఈ మేరకు సెర్రీ బ్రిన్ కోర్టులో విడాకుల పిటిషన్ కూడా దాఖలు చేశారు. పరస్పర విరుద్ధ అభిప్రాయాలు కారణంగానే విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్టు ఈ జంట పేర్కొంది.

సెర్జీ-నికోల్ 2018లో వివాహం బంధంతో ఒక్కటయ్యారు. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. సెర్జీకి అంతకుముందే వివాహమైంది. 23అండ్‌మీ సంస్థ సహ వ్యవస్థాపకురాలైన అన్నే వొజిస్కీని 2007లో వివాహం చేసుకున్న సెర్జీ 2015లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత షనాహన్‌తో సహజీవనం అనంతరం వివాహం చేసుకున్నారు. అన్నే వొజిస్కీతో సెర్జీకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, మనస్పర్థల కారణంగా సెర్జీ-షనాహన్‌ గతేడాది నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ నివేదిక ప్రకారం.. సెర్జీ బ్రిన్ సంపద 94 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే దాదాపు 73 లక్షల కోట్లతో ప్రపంచంలోనే ఆరో సంపన్నుడిగా ఉన్నారు.

అతను 1998లో ల్యారీ పేజ్‌తో కలిసి ఆల్ఫాబెట్ కంపెనీని స్థాపించారు. 2019లో వారు ఇద్దరు ఆల్ఫాబెట్‌ను విడిచిపెట్టారు. కానీ బోర్డులో ఇప్పటికీ వాటాదారులుగా ఉన్నారు. చిన్నారి కస్టడీకి సంబంధించిన వివరాలు బయటకు పొక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో విడాకుల విషయంలో వీరు గోప్యత పాటిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు, ఈ కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక న్యాయమూర్తిని కూడా ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది.