MarBurg Virus: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఇంకా పూర్తిగా తగ్గలేదు. మరోవైపు మంకీపాక్స్ కేసులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ఆఫ్రికా ఖండంలోని ఘనాలో అత్యంత వ్యాప్తి కలిగిన ‘మర్‌బర్గ్’ వైరస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే ఇద్దరు మృతిచెందినట్లు ఘనా ప్రభుత్వం వెల్లడించింది. వారితో సన్నిహితంగా మెలిగిన 98 మందిని క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపింది. మృతుల నమూనాలు సేకరించి సెనెగల్‌లోని ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహించగా మర్‌బర్గ్ వైరస్‌గా తేలినట్లు ఘనా హెల్త్ సర్వీస్ ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ధ్రువీకరించింది. మర్‌బర్గ్ వైరస్ సోకడం వల్ల వచ్చే వ్యాధి ప్రాణాంతకం అని తెలిపింది. ఈ వ్యాధి సోకిన వారిలో 88 శాతం మరణాల రేటు ఉంటుందని WHO హెచ్చరించింది.
Read Also: TikTok Video: ఆనందంలో సీక్రెట్స్ రివీల్ చేసింది.. ఉద్యోగం ఊడింది
కాగా ఘనా దేశంలోని ప్రజలందరూ గబ్బిలాలు, అడవి జంతువులకు దూరంగా ఉండాలని.. మాంసం ఉత్పత్తులను బాగా శుభ్రం చేసి ఉడికించిన తర్వాతే తీసుకోవాలని అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. అటు మర్‌బర్గ్ వైరస్‌కు చాలా వేగంగా విస్తరించే సామర్థ్యం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ఇది గాలి ద్వారా వ్యాపించదని.. ఇతరులను తాకడం వల్ల, ఇతర శరీర ద్రవాల ద్వారా, రక్త మార్పిడి ద్వారా, రోగుల పడక, దుస్తులను ఇతరులు వినియోగించడం ద్వారా మర్ బర్గ్ వైరస్ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వైరస్ సోకిన జంతువులు, గబ్బిలాల నుంచి మర్‌బర్గ్ వైరస్ మనుషులకు సోకుతుందని WHO హెచ్చరించింది. ప్రస్తుతం ఈ వైరస్ నివారణకు ఇంకా మందులు, వ్యాక్సిన్‌లు అందుబాటులో లేవని.. అందుకే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.