Site icon NTV Telugu

Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు చేదు అనుభవం.. ట్రంప్ కాన్వాయ్ కారణంగా రోడ్డుపై నిలిపివేత

Macron

Macron

అమెరికాలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. న్యూయార్క్‌లో జరుగుతున్న 80వ ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యేందుకు మాక్రాన్ వెళ్లారు. అయితే అదే సమయంలో ట్రంప్ కాన్వాయ్ కూడా వస్తోంది. దేశ అధ్యక్షుడు కాబట్టి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ రోడ్డుపై మాక్రాన్‌ను నిలిపివేశారు.

రోడ్డుపై మాక్రాన్, అతని బృందాన్ని పోలీసులు నిలిపివేశారు. ఈ సందర్భంగా ఒక పోలీస్ అధికారి మాక్రాన్‌తో సంభాషించారు. ‘‘క్షమించండి.. ప్రెసిడెంట్ కాన్వాయ్ వస్తోంది. ప్రస్తుతం ట్రాఫిక్ నిలిపివేశాం.’’ అని ఫ్రెండ్ అధ్యక్షుడితో పోలీస్ అధికారి సంభాషించారు. ఇక వెంటనే మాక్రాన్.. ట్రంప్‌కు ఫోన్ చేశారు. మీ కాన్వాయ్ కారణంగా రోడ్డుపై నిలబడాల్సి వచ్చిందని సరదాగా సంభాషించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టెలిఫోన్‌ సంభాషణలో ఇరువురు నేతలు స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారని ఫ్రాన్స్‌ అధికార వర్గాలు తెలిపాయి.

ఇది కూడా చదవండి: Trump: ట్రంప్, మెలానియాకు అవమానం! సడన్‌గా ఆగిన యూఎన్ ఎస్కలేటర్ రైడ్‌.. వైట్‌హౌస్ సీరియస్

ఇక యూఎన్ సమావేశంలో పాలస్తీనా రాష్ట్రాన్ని గుర్తిస్తున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ప్రకటించారు. ఫ్రాన్స్, సౌదీ అరేబియా కలిసి ఈ సమావేశం నిర్వహించింది. పాలస్తీనా రాజ్య హోదా, రెండు దేశాల పరిష్కారానికి అంతర్జాతీయ మద్దతు కోరింది. ఇక పాలస్తీనాకు ఫ్రాన్స్‌తో పాటు, అండోరా, బెల్జియం, లక్సెంబర్గ్, మాల్టా, మొనాకో నాయకులు మద్దతు ప్రకటించారు. ఇక ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, పోర్చుగల్ మద్దతు తెలిపాయి. ఇక ఈ సమావేశాన్ని అమెరికా, ఇజ్రాయెల్ బహిష్కరించాయి. ఇటలీ ప్రధాని మెలోని కూడా ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచింది. పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించబోమని ప్రకటించారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ.. పాలస్తీనా రాజ్యానికి మద్దతు తెల్పడడం అంటే ‘‘హమాస్‌కు బహుమతి’’గా అభివర్ణించారు.

ఇది కూడా చదవండి: Trump: హెచ్‌-1బీ లాటరీ వ్యవస్థపై ట్రంప్ మరో కీలక నిర్ణయం

ఇక ఈ యూఎన్ సమావేశానికి పాలస్తీనా నాయకులకు ప్రవేశం లేకుండా అమెరికా అడ్డుకుంది. ఇక పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ మాట్లాడుతూ.. హింసను అంతం చేయాలని పిలుపునిచ్చారు. పాలస్తీనా భూభాగాల్లో పాలన, సామాజిక కార్యక్రమాలను మెరుగుపరచడానికి సంస్కరణలను ప్రతిపాదించారు. ఇక పాలస్తీనా రాజ్య హోదా ఒక హక్కు అని, బహుమతి కాదని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు.

Exit mobile version