France: ఫ్రాన్స్‌లో కండోమ్‌ల కలకలం.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని సలహా..

  • ఫ్రాన్స్‌లో కండోమ్‌లపై భద్రతా హెచ్చరిక
  • సుమారు 3 లక్షల వరకు కండోమ్‌లు సురక్షితం కాకపోవచ్చని అంచనా
  • 2.6 లక్షల కండోమ్‌లను రీకాల్ చేసిన అధికారులు
France

France

France: ఫ్రాన్స్‌లో కండోమ్‌ల కలకలం చెలరేగింది. ఆన్‌లైన్, దుకాణాలు, ఫార్మసీల్లో విక్రయించిన వేలాది కండోమ్‌లు సురక్షితం కాకపోవచ్చని ఆ దేశ యాంటీ-ఫ్రాడ్, ఆరోగ్య సంస్థలు శుక్రవారం హెచ్చరించాయి. ల్యాబ్ టెస్టుల్లో రెండు రకాల కండోమ్‌లో పగిలిపోయే ప్రమాదం లేదా చిన్న రంధ్రాలు ఉండే అవకాం ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత అధికారులు ఈ ఆదేశాలు జారీ చేశారు. సుమారుగా 2.6 లక్షల కండోమ్‌లను రికాల్ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ కండోమ్‌లను ఇప్పటికే ఉపయోగించిన వారు లైంగికంగా సంక్రమించే వ్యాధులు (STDs) కోసం పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. అలాగే, పీరియడ్ ఆలస్యమైతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని తెలిపారు. వీటిలో సుమారు 1000 బాక్సులు అంటే 40,000కు పైగా కండోమ్‌లు ఇప్పటికే విక్రయించబడ్డాయని, దీంతో సంబంధిత ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లు ఆ ప్రొడక్స్ట్‌ను జాబితాల నుంచి తొలగించేందుకు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.

నిబంధనలకు అనుగుణంగా లేని బ్రాండ్లలో జపాన్‌కు చెందిన ఒకమోటో ఇండస్ట్రీస్, ఫ్రాన్స్‌కు చెందిన మైల్యూబీ, ఫ్రైడే బీ తదితర బ్రాండ్లు ఉన్నాయి. అయితే, దీనిపై మై ల్యూబీ సీఈఓ పియర్ లగాష్ మాట్లాడుతూ.. రీకాల్ కేవలం ఒక బ్యాచ్ కండోమ్‌లకు సంబంధించింది మాత్రమే తెలిపారు.