France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, విద్యారంగానికి నిధుల కొరత, జీవన వ్యయాలు అధికం కావడం వంటి సమస్యలపై ప్రజలు ఆందోళనకు దిగారు. రాజధాని పారిస్‌తో పాటు పలు నగరాల్లో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వెయ్యి మందికి పైగా అరెస్టయ్యారు.
ఫ్రాన్స్‌లో ప్రారంభమైన నిరసనలు క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. పారిస్‌తో పాటు లియోన్, క్లెర్మాంట్-ఫెరాండ్, స్ట్రాస్‌బర్గ్ వంటి నగరాల్లో పోలీసులు నిరసనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. నీస్, నాంటెస్ నగరాల్లో ఆందోళనలను అదుపు చేసేందుకు వాటర్ క్యానన్లను ఉపయోగించారు. కొన్ని ప్రాంతాల్లో దుకాణాలపై దాడులు, దోపిడీలు, అగ్నిప్రమాదాలు, పోలీసులపై దాడులు జరిగాయి. నిరసనలు మరింత తీవ్రరూపం దాల్చకుండా ఫ్రాన్స్ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. దేశవ్యాప్తంగా 70 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించింది. హెలికాప్టర్లు, సాయుధ వాహనాలతో నిఘా కొనసాగించడంతో పాటు, అవసరమైన ప్రాంతాల్లో టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లను ఉపయోగించినట్లు తెలిపింది.
శాంతిని పాటించాలని మాక్రాన్ విజ్ఞప్తి
దేశంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రజలకు శాంతి పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు సమాజాన్ని విభజించే ప్రయత్నాలకు ప్రభావితులు కావద్దని, ఒక వర్గాన్ని మరో వర్గానికి వ్యతిరేకంగా నిలబెట్టే పరిస్థితులకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఫ్రాన్స్ గణతంత్ర వ్యవస్థ ఐక్యత, సామరస్యంపై ఆధారపడి ఉందని మాక్రాన్ వ్యాఖ్యానించారు.
ఈ ఆందోళనలకు ప్రధాన కారణాలుగా పెరుగుతున్న జీవన వ్యయాలు, ద్రవ్యోల్బణం, విద్యారంగంలో నిధుల కొరత వంటి అంశాలు. విద్యార్థుల డిమాండ్లతో ప్రారంభమైన నిరసనలు విస్తృత ప్రజా ఆందోళనగా మారాయి. పారిస్‌లో నిరసన ప్రదర్శనకు అధికారులు నిర్దిష్ట మార్గాన్ని కేటాయించారు. మార్చ్ పోర్ట్ ద్ ఇటలీ ప్రాంతం నుంచి ప్రారంభమై పోర్ట్ ద్ విన్సెన్స్ వరకు సాగింది. కొందరు నిరసనకారులు ప్లాస్ దె లా నాసియోన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
#WATCH | France | Protests Turn Violent as Demonstrators Clash with Riot Police in Paris; large numbers of people are protesting across France against the rising cost of living.
(Source: Reuters) https://t.co/Mtj9w1EL1l
— ANI (@ANI) October 25, 2026

