Russia-Ukraine War: ఈ ఏడాదిలో ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యా ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తొలుత ముట్టడించి, ఆ తర్వాత వీడిన ప్రాంతాల్లో.. రష్యా పాల్పడ్డ అనేక దారుణాలు బట్టబయలు అవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో వాళ్లు ఉక్రెయిన్ పౌరుల్ని బంధించి.. వారిని చిత్రహింసలకు గురి చేసిన ఘటనలు బయటపడుతున్నాయి. మొదట్లో కీవ్ ముట్టడికి ప్రయత్నించిన మాస్కో బలగాలు.. ఉక్రెయిన్ ఎటాక్ ధాటికి వెనక్కు వెళ్లిపోయాయి. అప్పుడు అధికారుల రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని పరిశీలించగా.. నిర్బంధ కేంద్రాల్ని గుర్తించారు. పౌరుల్ని ఆ కేంద్రాల్లో బంధించి, అత్యంత కిరాతకింగా హింసించినట్టు గుర్తించారు. మేరియుపోల్, ఖర్కివ్‌లలో కూడా ఇదే దుస్థితి. ఆ రెండు ప్రాంతాల్ని ముట్టడించిన సమయంలో.. పౌరుల్ని టార్చర్ పెట్టారు. వెనక్కు వెళ్లిపోతూ, నిర్బంధ ప్రాంగణాల్లో తమ ఆకృత్యాలకు సంబంధించిన ఆనవాళ్లను వదిలి వెళ్లారు.
తాజాగా ఖేర్సన్‌లో కూడా ఇదే తరహా ఆకృత్యాలు బయటపడుతున్నాయి. పౌరులను బంధించి, చిత్రహింసలకు గురిచేసిన నాలుగు నిర్బంధ కేంద్రాల్ని గుర్తించినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఇటీవలే ఈ ప్రాంతాన్ని రష్యా సైనికులు వీడిన తర్వాత ఉక్రెయిన్ అధికారులు అక్కడ దిగి, పరిశీలించారు. ఈ క్రమంలోనే ఈ కేంద్రాల్ని గుర్తించారు. వాటితో పాటు నగరవ్యాప్తంగా రష్యన్ పాల్పడ్డ దారుణాల్ని అధికారులు నమోదు చేసుకుంటున్నారు. స్థానికులను పుతిన్ సేనలు చట్టవిరుద్ధంగా బంధించి, వారిని క్రూరంగా హింసించిన నాలుగు ప్రాంగణాల్ని తమ అధికారులు తనిఖీ చేసినట్లు.. ఉక్రెయిన్ జనరల్ ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది. ఆ కేంద్రాలతో పాటు ఒక పోలీస్ స్టేషన్‌ని సైతం పుతిన్ సేనలు ఏర్పాటు చేశాయని, అందులో నకిలీ చట్ట సంస్థలను నడిపారని కూడా తెలిపింది. హింసాగృహాల్లో రబ్బరు లాఠీలు, చెక్క బ్యాట్‌లు, కరెంట్ షాక్‌తో పౌరులను హింసించే పరికరాలు కనుగొన్నట్లు పేర్కొంది. ఆయా ఘటనలపై పూర్తిస్థాయిలో సాక్ష్యాల్ని సేకరిస్తున్నామని, వాటిని యుద్ధ నేరాల కింద విచారిస్తామని అధికారులు స్పష్టం చేశారు.