అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని దక్షిణ కాలిఫోర్నియా ఆస్పత్రిలో చేర్పించారు. రక్త సంబంధ ఇన్‌ఫెక్షన్‌తో ఆయన బాధపడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం క్లింటన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందంతో పాటు నర్సులు, ఆస్పత్రి సిబ్బంది క్లింటన్‌కు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని అన్నారు. మూడు రోజుల క్రితమే క్లింటన్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. రక్తంలో ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వైద్యులు వెల్లడించారు.
also read : గెలిచే టీం ను అంచనా వేయండి 50 లక్షలు గెలవండి
అమెరికా అధ్యక్షుడిగా బిల్‌క్లింటన్ వరుసగా రెండు సార్లు పనిచేశారు. 2001 తర్వాత వైట్‌హౌస్‌ను వీడిన ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. 2004లో తీవ్ర ఛాతి నొప్పి, శ్వాసకోస సమస్యలు రావడంతో ఆయనకు నాలుగుసార్లు బైపాస్ సర్జరీ చేశారు. ఏడాది తర్వాత ఊపిరితిత్తులు మళ్లీ దెబ్బతినడంతో 2005లోనూ తిరిగి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. 2010లో గుండె సంబంధిత సమస్య రావడంతో మరోసారి శస్త్రచికిత్స చేసి రెండు స్టంట్లు అమర్చారు. తర్వాత కొన్ని రోజులకు కోలుకున్న బిల్‌క్లింటన్ పూర్తి ఆరోగ్యంగా కనిపించారు. ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున ప్రచారంలోనూ పాల్గొన్నారు. హిల్లరీ క్లింటన్ తరపున పలుసార్లు ప్రచార బాధ్యతలను బిల్‌క్లింటన్ చేపట్టారు. క్లింటన్ ఫౌండేషన్ కు సంబంధించిన కార్యక్రమం కోసం కాలిఫోర్నియాలో ఉన్న సమయంలో అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల చికిత్స తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని తెలుస్తోంది. అయితే కొద్ది రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు.
