Site icon NTV Telugu

KP Sharma Oli: 24 గంటలుగా కనిపించని నేపాల్ మాజీ ప్రధాని ఓలి ఆచూకీ.. ఏదైనా జరిగిందా?

Kp Sharma Oli

Kp Sharma Oli

జెన్-జెడ్ ఉద్యమానికి తలొగ్గి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. రాజీనామా చేసి 24 గంటలు గడుస్తున్నా ఓలి ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు లభించలేదు. ఆయనను లక్ష్యంగా చేసుకుని నిరసనకారులు ఏమైనా దాడి చేశారు. లేదంటే దుబాయ్‌కి పారిపోయారా? అన్నది ఇంకా తెలియలేదు. దీనిపై సైన్యం కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఓలి సమాచారం తమకు కూడా తెలియదని సైన్యం వెల్లడించింది. దీంతో ఆయన ఎక్కడ ఉన్నారన్న దానిపై సందిగ్ధం నెలకొంది. క్షేమంగానే ఉన్నారా? లేదంటే దుబాయ్ వెళ్లిపోయారా? చర్చ నడుస్తోంది.

ఇది కూడా చదవండి: Nepal: మహిళా మంత్రిపై మూకుమ్మడి దాడి.. వెలుగులోకి వచ్చిన భయానక దృశ్యాలు

అయితే ఓలి రాజీనామా చేశాక అజ్ఞాతంలోకి వెళ్లారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా నేపాల్ సైన్యం ఓలిని తన ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చిందని ఖాట్మండు నుంచి నివేదికలు అందాయి. కానీ ఆయన ఎక్కడున్నారన్న విషయం మాత్రం వెల్లడించలేదు. అయితే ఓలి మయన్మార్ రాజధాని నేపిడాకు పారిపోయినట్లు మరిన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ పుకార్లేనని సైన్యం కొట్టిపారేస్తోంది. సైన్యం ఇంకా అధికారింగా నిర్ధారించలేదు.

ఇది కూడా చదవండి: Sweden: షాకింగ్ ఘటన.. ప్రెస్‌మీట్‌లో ఉండగా కుప్పకూలిన స్వీడన్ మంత్రి.. వీడియో వైరల్

కేపీ శర్మ ఓలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం రణరంగంగా మారింది. సోమ, మంగళవారాల్లో జరిగిన విధ్వంసానికి నేపాల్ రాజధాని ఖాట్మండు అతలాకుతలం అయిపోయింది. ప్రభుత్వ భవనాలు, కార్లు, ఆస్తులను నిరసనకారులు ధ్వంసం చేశారు. ఇక మాజీ ప్రధాని ఇంటికి నిప్పుపెట్డడంతో మాజీ ప్రధాని ఝలనాథ్ ఖనాల్ భార్య రాజ్యలక్ష్మీ చిత్రాకార్ సజీవ దహనం అయ్యారు. ఇక మంత్రులనైతే పరిగెత్తించి కొట్టారు.

ఇక పరిస్థితులు చేదాటిపోవడంతో కేపీ శర్మ ఓలి(73) ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం సైన్యం పరిపాలనను అదుపులోకి తీసుకుంది. కర్ఫ్యూ సెప్టెంబర్ 11, సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటుందని సైన్యం వెల్లడించింది. ఇక దోపిడీ, అల్లర్లకు పాల్పడుతున్న 26 మందిని అరెస్ట్ చేసినట్లు సైన్యం ప్రకటించింది. నిరసనల పేరుతో నేర కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయని.. కొందరు లైంగిక దాడులకు కూడా పాల్పడుతున్నారని వివరించింది. దయచేసి పౌరులంతా సహకరించాలని సైన్యం ఒక ప్రకటనలో కోరింది.

Exit mobile version