Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్

  • సంచలన విషయాలు వెల్లడించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్..
  • ప్రార్థనలు చేస్తూ వెనక నుంచి దాడి చేసిన కోపైలట్..
  • వెనక నుంచి తలపై దాడి చేసిన నిందితుడు..
  • శక్తినంతా కూడదీసుకుని కాక్‌పిట్ డోర్ ఓపెన్ చేసిన స్మిత్..
Flydubai Attack

Flydubai Attack

దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని రక్షించి హీరోగా నిలిచిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్, దాడికి సంబంధించిన సంచలన విషయాలు వెల్లడించారు. కాక్‌పిట్‌లో జరిగిన భయానక విషయాలను ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పంచుకున్నారు. తీవ్రంగా గాయపడిన మచ్చర్ ప్రస్తుతం దుబాయ్‌లో చికిత్స పొందుతున్నారు.

విమాన ప్రయాణం సాధారణంగా ప్రారంభమైందని, తన కో-పైలట్ ప్రార్థన చేసేందుకు వెళ్లిన సమయంలో తాను గౌరవంతో కాక్‌పిట్ ముందు వైపు చూస్తూ ఉన్నానని చెప్పారు. అతను తన వెనక ప్రార్థనాలు చేస్తూ ఉన్నాడని, అందుకే వెనక్కి చూడలేకపోయానని చెప్పారు. నాలుగైదు నిమిషాల తర్వాత అకస్మాత్తుగా తన తల వెనక బలమైన దెబ్బ తగిలిందని వెల్లడించారు. మొదట విమానంలో ఏదో ప్రమాదం జరిగిందని భావించానని, ఆ తర్వాత వరసగా దెబ్బలు పడుతుంటే కో-పైలట్ దాడి చేస్తున్నట్లు గ్రహించినట్లు వెల్లడించారు. దాడి కారణంగా తన చూపు మసకబారిందని, విమానం వేగంగా కిందకు దిగడం ప్రారంభమైందని అన్నారు.

‘‘నేను కాక్‌పిట్ తలుపు ఒకసారి తెరవడానికి ప్రయత్నించాను. కానీ అతను దాన్ని మళ్లీ మూశాడు. ఆ తర్వాత నేను కాక్‌పిట్ నేలపై పడిపోయాను. విమానం కిందకు వెళ్తున్న శబ్ధం, ప్రయాణికుల అరుపులు వినిపించాయి’’ అని వివరించారు. ఆ సమయంలో నా దగ్గర ఒక చివరి పోరాటం మిగిలి ఉందని అనిపించిందని, నేను చేయకపోతే చనిపోతాను, అందుకనే నా దగ్గర ఉన్న శక్తినంతా ఉపయోగించి తలుపుల వైపు వెళ్లి దానిని తెరిచానని చెప్పారు. లక్కీగా బయట ఉన్న ప్రయాణికులు లోపలికి వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన కో-పైలట్ ఒమన్‌కు చెందిన అల్ హమ్మామీగా గుర్తించారు. ఇది ఉగ్రవాద దాడే అని యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నారు. మరోవైపు, ఈ విచారణలో ఇజ్రాయిల్ కూడా భాగస్వామ్యమైంది. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ మాట్లాడుతూ.. కోపైలట్ తీవ్ర ఇస్లామిక్ భావజాలానికి ప్రభావితమై ఉండొచ్చని అన్నారు. 180 మంది ప్రయాణికుల్ని రక్షించిన స్మిత్ మచ్చర్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్రమోడీ, నెతన్యాహూలు ఆయనను కొనియాడారు.