దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు ప్రయాణిస్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విమానం నుంచి ఒక్కసారిగా ‘‘స్క్వాక్ (Squawk) 7500 కోడ్’’ జారీ అయింది. విమానం హైజాక్ అయినప్పుడు ఇలాంటి కోడ్ జారీ అవుతోంది. దీంతో విమానం హైజాక్ అయిందన్న వార్తల నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమై ఫైటర్ జెట్లు రంగంలోకి దిగాయి. అయితే కొన్ని నిమిషాల గందరగోళం తర్వాత విమానం సౌదీ అరేబియాలోని టబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానం కాక్‌పిట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య గొడవ జరిగినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు వెల్లడించాయి.
అసలేం జరిగింది?
ఫ్లై దుబాయ్‌కు చెందిన FZ1073 విమానం దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు ప్రయాణిస్తోంది. ఉన్నట్టుండి ‘Squawk 7500 కోడ్’ ప్రసారం చేసింది. విమానంలో చట్టవిరుద్ధ జోక్యం లేదా భద్రతాపరమైన అత్యవసర పరిస్థితి ఉందని సూచించేందుకు ఈ అంతర్జాతీయ ట్రాన్స్‌పాండర్ కోడ్‌ను ఉపయోగిస్తారు. సాధారణంగా దీనిని హైజాక్ అనుమానం ఉన్నప్పుడు ఉపయోగిస్తారు. అయితే ఇజ్రాయెల్‌కు చెందిన N12 టెలివిజన్ కథనం ప్రకారం.. విమానం హైజాక్ అయినట్లు ఎలాంటి నిర్ధారణ లేదు. అయితే కాక్‌పిట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన ఘర్షణ కారణంగానే ఈ అలర్ట్ పంపబడినట్లు సమాచారం. N12 కథనం ప్రకారం.. పైలట్ల మధ్య జరిగిన గొడవలో ఒక పైలట్ స్పృహ కోల్పోయినట్లు సమాచారం. విమానం సౌదీ అరేబియాలో ల్యాండ్ అయిన తర్వాత ఇద్దరు పైలట్లను విమానం నుంచి తొలగించినట్లు తెలిపింది. అయితే ఒక పైలట్ రష్యాకు చెందినవాడని, మరొక పైలట్ ఉక్రెయిన్‌కు చెందినవారని N12 కథనం పేర్కొంది. అయితే వారి పౌరసత్వం గురించి స్పష్టత ఇవ్వలేదు. మరో ఇజ్రాయెల్ మీడియా సంస్థ వాల్లా కథనం ప్రకారం.. విచారణకు గురైన పైలట్ ఒమన్‌కు చెందినవాడని పేర్కొంది. పైలట్ల గుర్తింపు, వారి నేపథ్యంపై వచ్చిన వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ ఘటనను 2001 సెప్టెంబర్ 11 దాడులు లేదా 1976 ఎంటెబ్బే బందీల సంక్షోభంతో పోల్చినట్లు వచ్చిన వ్యాఖ్యలు అధికారికంగా స్వతంత్రంగా ధ్రువీకరించబడలేదు.
ఇజ్రాయెల్ రంగంలోకి…!
సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం ఉన్న ఈ విమానం సౌదీ అరేబియా గగనతలంలో ప్రయాణిస్తున్న సమయంలో Squawk 7500 సంకేతం పంపింది. అనంతరం విమానం తన మార్గాన్ని మార్చుకున్నట్లు ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. హైజాక్ జరిగిందా? లేక మరేదైనా భద్రతాపరమైన అత్యవసర పరిస్థితి తలెత్తిందా? అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఇజ్రాయెల్ వైమానిక దళం ఫైటర్ జెట్లను పంపినట్లు సమాచారం. Squawk 7500 అనేది విమానంపై చట్టవిరుద్ధ జోక్యం జరుగుతోందని సూచించే కోడ్. అయితే ఈ కోడ్ ప్రసారం కావడం మాత్రమే విమానం నిజంగా హైజాక్ అయిందని నిర్ధారించదు. కాక్‌పిట్‌లో జరిగినట్లు చెబుతున్న గొడవతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనట్లు కథనాలు పేర్కొన్నాయి. కొంతమంది ప్రయాణికులు “కేకలు, రక్తం” కనిపించాయని చెప్పినట్లు సమాచారం. ఓ పైలట్‌పై కత్తితో దాడి జరిగి ఉండొచ్చని కూడా కొందరు ప్రయాణికులు అనుమానం వ్యక్తం చేసినట్లు కథనాలు పేర్కొన్నాయి. అయితే కత్తితో దాడి జరిగిందన్న ఆరోపణకు ఇప్పటివరకు స్వతంత్ర ధ్రువీకరణ లేదు. ఈ ఘటన తర్వాత విమానం వేగంగా కిందకు దిగడంతో తమ ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని ప్రయాణికులు భయపడినట్లు కూడా సమాచారం.

