US Plane Crash: భయంతో అరిచిన పైలట్.. క్షణాల్లో కుప్పకూలిన విమానం.. వెలుగులోకి చివరి క్షణాలు.!

  • అమెరికా ఫ్లోరిడాలో ఘోర విమాన ప్రమాదం..
  • కుప్పకూలిన లియర్‌జెట్ 60, 9 మంది దుర్మరణం..
  • మహిళా పైలట్ చివరి క్షణాలు వైరల్..
Us Plane Crash

Us Plane Crash

US Plane Crash: అమెరికా ఫ్లోరిడాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఆదివారం గ్రీన్‌ఏకర్స్‌లోని నివాస ప్రాంతంలో లియర్‌జెట్ 60 విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 09 మంది మరణించారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రకారం, లియర్‌జెట్ 60 విమానం టెక్సాస్‌లోని ఆస్టిన్-బెర్గ్‌స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి బహామాస్‌లోని నార్త్ ఎల్యూథెరాకు వెళ్తోంది. విమానం 35,000 అడుగుల ఎత్తులో విమానంపై మంచు పేరుకుపోవడం, ఎయిర్ టర్బులెన్స్ కారణంగా ప్రమాదానికి కారణమైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అంతకుముందు పైలట్లు మంచు పేరుకుపోతున్న విషయాన్ని గమనించినప్పటికీ, పరిస్థితి అదుపులోనే ఉందని కంట్రోలర్లకు తెలిపారు. అయితే, వర్షపాతం ఉన్న ప్రాంతంలోకి విమానం ప్రవేశించిన తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోయాయ.

వాతావరణంగా బాగా లేకపోవడంతో 35,000 అడుగుల నుంచి మరో 2000 అడుగుల ఎత్తుకు వెళ్లేందుకు పైలట్లు అనుమతి కోరారు. విమానం సుమారు 41,000 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా వేగంగా కిందికి దిగడం ప్రారంభించింది. మొదట నిమిషానికి 10,000 అడుగుల వేగంతో దిగిన విమానం, ఆ తర్వాత నిమిషానికి 20,000 అడుగులు, చివరకు 30,000 అడుగుల వేగంతో వచ్చి నేలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విమానం అగ్నిగోళంగా మారింది. కూలిన ప్రాంతంలో పెద్ద గుంత తప్పా ఏమి లేదు.

పైలట్ చివరి క్షణాలు వైరల్..

విమానం కూలిపోతున్న సమయంలో పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్(ATC)తో జరిపిన సంభాషణలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ‘‘మనం ఇక సమయం కోల్పోయే పరిస్థితిలో లేము’’ అని విమానంలోని మహిళా సిబ్బంది అరిచినట్లు ఏటీసీ ఆడియోలో వినిపించింది. అంతకుముందు పైలట్ ‘‘ మేము 8,000 అడుగుల వేగంతో దిగుతున్నాం. మేడే, మేడే నిమిషానికి 10,000 అడుగుల వేగంతో కిందికి దిగుతున్నాం’’ అని ఎమర్జెన్సీ సందేశాన్ని పంచించారు.

పరిస్థితి విషమించడంతో ‘‘మేము ఓవర్‌స్పీడ్ పరిస్థితిలో ఉన్నాం. నిమిషానికి 20,000 అడుగుల వేగంతో దిగుతున్నాం. నేలను ఢీకొట్టబోతున్నాం’’ అని పైలట్ అనడం రికార్డ్ అయింది. విమానాన్ని నియంత్రించేందుకు , వారికి సహకరించేందుకు ఏటీసీ చివరి వరకు సంప్రదింపులు కొనసాగించింది. ‘‘నవంబర్ టూ బ్రావో డెల్టా.. నేను మీతోనే ఉన్నాను.. మాట్లాడండి’’ కంట్రోలర్ స్పందించారు. దీనికి పైలట్ ‘‘మేము 22,000 అడుగుల వేగంతో దిగుతున్నాం.. 60 డిగ్రీల కోణంలో తిరుగుతున్నాం.. నియంత్రణ కోల్పోతున్నాం’’ అన సమాధానమిచ్చారు. చివరకు విమానం కుప్పకూలడంతో ఈ సంభాషణలు ఆగిపోయాయి.