F-16 Fighter Jet Crash: అమెరికాలో F-16 ఫైటర్ జెట్ క్రాష్.. వీడియో వైరల్, దర్యాప్తు షురూ

  • అమెరికాలో శిక్షణ విమానానికి ప్రమాదం
  • F-16 కూలి పైలట్‌కు గాయాలు
F 16 Fighter Jet

F 16 Fighter Jet

F-16 Fighting Falcon Crash in America: అమెరికాలో శిక్షణ విమాన ప్రయాణం సమయంలో టెక్సాస్ ఎయిర్ నేషనల్ గార్డ్‌కు చెందిన F-16 ఫైటర్ జెట్ ప్రమాదానికి గురైంది. మిషిగన్‌లోని గ్రాండ్ ట్రావర్స్ కౌంటీలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం తర్వాత పైలట్ సురక్షితంగా విమానం నుంచి బయటకు వచ్చాడు. అయితే అతడికి గాయాలు కాగా, ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

శిక్షణ సమయంలోనే ప్రమాదం

CBS న్యూస్ ప్రకారం, టెక్సాస్ నేషనల్ గార్డ్‌కు చెందిన 149వ ఫైటర్ వింగ్ నిర్వహిస్తున్న F-16 ఫైటింగ్ ఫాల్కన్ సాధారణ శిక్షణ విమాన ప్రయాణంలో ఉండగా ప్రమాదానికి గురైంది. ఈ విమానం అల్పెనా ప్రాంతంలోని ఎయిర్ నేషనల్ గార్డ్ కాంబాట్ రెడీనెస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి శిక్షణ మిషన్‌పై బయలుదేరింది. ఈ క్రమంలో గ్రాండ్ ట్రావర్స్ కౌంటీలో కూలిపోయింది.

పైలట్‌కు గాయాలు.. పరిస్థితి నిలకడగా

టెక్సాస్ మిలిటరీ డిపార్ట్‌మెంట్ ప్రమాదాన్ని ధ్రువీకరించింది. 149వ ఫైటర్ వింగ్ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం, పైలట్ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉంది. ప్రమాదానికి గల కారణాలను అధికారులు వెల్లడించలేదు. గ్రాండ్ ట్రావర్స్ కౌంటీ షెరీఫ్ కార్యాలయానికి సహాయం అందిస్తున్న మిషిగన్ స్టేట్ పోలీసుల ప్రకారం, ఇప్పటివరకు మరెవరూ గాయపడినట్లు సమాచారం లేదు.

ప్రమాద ప్రాంతం ఖాళీ చేయించాలని ఆదేశాలు

‘ద హిల్’ నివేదిక ప్రకారం, మిషిగన్ స్టేట్ పోలీసులు ప్రమాద స్థలం చుట్టూ ఒక మైలు పరిధిలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. విమానం కూలిన తర్వాత ప్రమాదకర రసాయనాలు లీక్ అయ్యే అవకాశం ఉందనే ఆందోళనతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అంతకుముందు స్థానిక ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని, కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని అధికారులు సూచించారు.

రహదారులు మూసివేత.. ప్రజలకు హెచ్చరిక

F-16 ఫైటర్ జెట్ కౌంటీ రోడ్ 633, బ్లెయిర్ టౌన్‌హాల్ రోడ్ సమీపంలో కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద స్థలం చుట్టుపక్కల రహదారులను మూసివేశారు. అత్యవసర సహాయక బృందాలు తమ విధులు నిర్వహించేందుకు వీలుగా నివాసితులు, వాహనదారులు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని సూచించారు.

పక్షిని ఢీకొట్టిందా? దర్యాప్తు ప్రారంభం

‘ద హిల్’ కథనం ప్రకారం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆడియోలో F-16 కూలిపోవడానికి కొద్దిసేపటి ముందు విమానం ఏదైనా పక్షిని ఢీకొని ఉండొచ్చనే సంకేతాలు కనిపించాయి. అయితే విమానం పక్షిని ఢీకొట్టిందనే విషయాన్ని సైనిక అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.