Site icon NTV Telugu

Ukraine Crisis: రష్యాపై మరో పిడుగు.. చమురుపై నిషేధం

Eu Ban Russian Oil Imports

Eu Ban Russian Oil Imports

ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించినప్పటి నుంచి అమెరికా సహా అనేక పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా యూరోపియన్ యూనియన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆరు నెలల్లో రష్యా నుంచి చమురు దిగుమతులను ఏకంగా 90 శాతం తగ్గించుకునేందుకు యూరప్‌ దేశాలన్నీ అంగీకరించాయి. మంగళవారం జరిగిన ఈయూ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.

ఈ కొరతని అధిగమించేందుకు.. వీలైనంత త్వరగా ఇతర సరఫరా మార్గాల్ని వెదుక్కోవాలని, సంప్రదాయేతర ఇంధన వనరులకు మళ్ళాలని డిసైడ్ అయ్యాయి. ఈయూ తీసుకున్న ఈ నిర్ణయంతో.. సముద్ర మార్గాన రష్యా నుంచి యూరప్‌కు జరిగే ఇంధన సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. అయితే.. హంగరీ వంటి మధ్య, తూర్పు యూరప్ దేశాలకు మాత్రం పైప్‌లైన్ ద్వారా సరఫరాలు కొనసాగుతాయి. కేవలం చమురుపైనే కాదు.. రష్యాలోని అతి పెద్ద బ్యాంకుపైనా, అలాగే ఆ దేశ మీడియాపైనా ఈయూ ఆంక్షలు విధించింది.

నిజానికి.. యూరప్ తన చమురు అవసరాల్లో 25 శాతం, గ్యాస్‌ అవసరాల్లో 40 శాతం రష్యాపైనే ఆధారపడింది. అందుకే.. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగినప్పటి నుంచీ రష్యా నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతుల్ని పూర్తిగా నిలిపేయాలని డిమాండ్లు వెల్లువెత్తినా యూరప్ దేశాలు సమ్మతించలేదు. కానీ, ఇప్పుడు వెనక్కు తగ్గి రష్యా చమురుపై నిషేధం విధించాయి. హంగరీ మాత్రం.. తమ ఇంధన భద్రతకు హామీ ఇస్తేనే నిషేధానికి మద్దతిస్తామని ఫిట్టింగ్ పెట్టింది. రష్యా మాత్రం ఈయూ నిర్ణయాన్ని తేలిగ్గా తీసుకుంది.

అంతర్జాతీయ మార్కెట్లో చమురు డిమాండ్‌కు కొదవ లేదని, ఇతర దిగుమతిదారుల్ని చూసుకుంటామని తేల్చి చెప్పింది. బల్గేరియా, పోలండ్, ఫిన్లండ్‌లకు చమురు ఎగుమతులను రష్యా ఇప్పటికే నిలిపేసింది. డెన్మార్క్‌కు కూడా మంగళవారం నుంచి సరఫరాలు ఆపేస్తున్నట్టు రష్యా ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం గజ్‌ప్రోమ్‌ ప్రకటించింది. అటు.. తమ పట్ల విద్వేషమే ఏకైక ప్రాతిపదికగా ఈయూ ఈ నిర్ణయం తీసుకుందని రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వదెవ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Exit mobile version