NTV Telugu Site icon

Ethiopia: ఇథియోపియాలో జాతుల ఘర్షణ.. 230 మంది బలి

Ethiopia Ethnic Attack

Ethiopia Ethnic Attack

తూర్పు ఆఫ్రికాలోని ఇథియోపియా జాతుల ఘర్షణలతో మరోసారి నెత్తురోడింది. ఈ ఘర్షణల్లో అమ్హారా తెగకు చెందిన 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఒరోమియా ప్రాంతంలో జరిగిన ఈ ఘర్షణల్లో 230 మంది మరణించినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. జాతుల ఘర్షణలో ఇటీవల జరిగిన అత్యంత దారుణమైన ఘటన ఇదేనని అధికారులు చెబుతున్నారు. రెబల్ గ్రూపే ఊచకోతకు పాల్పడిందని ఆరోపణలు వినిపిస్తుండగా, ఆ గ్రూపు మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. ఆఫ్రికాలోనే అత్యంత ఎక్కువ జనాభా గల రెండో దేశమైన ఇథియోపియాలో ఇటీవలి కాలంలో జాతుల ఘర్షణలు పెరిగాయి. తాను 230 మృతదేహాల్ని లెక్కించానని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

‘‘నేను 230 మృతదేహాలను లెక్కించాను. చాలా భయపడ్డాను. ఇంతటి మారణహోమాన్ని చూడడం ఇదే తొలిసారి. మా జీవితంలో పౌరులపై జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇదే’’ అని గింబీ కౌంటీకి చెందిన అబ్దుల్-సీద్ తాహిర్ పేర్కొన్నారు. మరో ప్రత్యక్ష సాక్షి షాంబెల్ మాట్లాడుతూ.. మరోమారు సామూహిక హననం జరగకముందే తమను మరో ప్రాంతానికి సురక్షితంగా తరలించాలని ఆర్మీని వేడుకున్నారు. పునరావాస కార్యక్రమంలో భాగంగా 30 ఏళ్ల క్రితమే ఇక్కడ స్థిరపడ్డామని కానీ, ఇప్పుడు కోళ్లను కోసినట్టు కోసి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బలగాలు వెళ్లిపోయిన తర్వాత మళ్లీ వారు విరుచుకుపడతారేమోనని భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒరోమో లిబరేషన్ ఆర్మీ (ఓఎల్ఏ) నే ఈ దాడులకు పాల్పడిందని ప్రత్యక్ష సాక్షులు ఇద్దరూ ఆరోపించారు. ఒరోమో ప్రాంతీయ ప్రభుత్వం కూడా ఓఎల్ఏనే కారణమని ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణల్లో ఎంతమాత్రమూ నిజం లేదని ఓఎల్ఏ అధికార ప్రతినిధి ఒడ్డా తర్బీ పేర్కొన్నారు.

Srilanka Crisis: శ్రీలంకలో ఉద్రిక్తత.. ఆందోళనకారులపైకి సైన్యం కాల్పులు