భూ చరత్రలో, మానవజాతి మొదలైనప్పటి నుంచి చరిత్రలో కనీవిని ఎరగనంతగా భూమిపై కార్బన్ డయాక్సైడ్ పెరుగుతోంది. తాజాగా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ ఏడాది మేలో భూగ్రహంపై సీఓ2 వాయువు రికార్డ్ స్థాయికి చేరుకుందని వెల్లడించింది. పారిశ్రామిక విప్లవానికి ముందున్న కార్బన్ డయాక్సైడ్ తో పోలిస్తే 50 శాతం అధికంగా వాతావరణంలోకి సీఓ2 విడుదల అవుతోంది.
జూన్ 3న హవాయ్ లోని మౌనాలోవా అగ్నిపర్వతంపై ఉన్న ఎన్ఓఏఏ వాతావరణ స్టేషన్ లో వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ ని కొలిస్తే 421 పార్ట్స్ పర్ మిలియన్‌కు చేరుకుంది. ఇది గతంలో మనం ఎప్పుడూ చూడని స్థాయికి చేరుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా పవర్ ప్లాంట్లు, ఆటోమోబైల్స్, పంట వర్థ్యాల దహనం, ఇతర వనరులు వాతావరణంలోకి పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ ను వదులుతున్నాయి. దీంతో గాలిసాంద్రత నాలుగు మిలియన్ ఏళ్లలో అత్యధికంగా నమోదు అయింది. 2021లో కాలుష్య ఉద్గారాల మొత్తం 36.3 బిలియన్ టన్నులకు చేరుకుంది. ఇది మానవ చరిత్రలోనే అత్యధిక స్థాయి. ప్రపంచ వ్యాప్తంగా మానవుడి అవసరాలకు, సదుపాయాలకు అనుగుణంగా వాతావరణాన్ని మార్చివేస్తున్నారని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
ప్రస్తుతం పెరుగుతున్న కార్బన్ డయాక్సైడ్ కు అడ్డుకట్ట వేయకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో సీఓ2 వల్ల భూ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్ పెరుగుతోంది. ఫలితంగా దీర్ఘకాలంలో అధిక వరదలు, తీవ్రమైన వేడి, కరువు, అడవుల్లో కార్చిచ్చు ఇలా అనేక సవాళ్లను మానవుడు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
