దక్షిణ అమెరికా దేశం పెరులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దక్షిణ పెరులోని అజాంగారో పట్టణానికి పశ్చిమ వాయువ్యంగా 8 మైళ్లదూరంలో భూకంప కేంద్రం ఉంది. లిటికాకా సరస్సుకు సమీపంలో ఈ భూకంపం సంభవించింది. ఈ ప్రాంతం పెరు- బొలీవియా దేశాల సరిహద్దుల్లో ఉంది. దాదాపుగా 217 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్ర ఉంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదు.
ఇదిలా ఉంటే ఈ ప్రాంతంలో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. పెరు తీరాన్ని అనుకుని ఉన్న పసిఫిక్ సముద్రంలో నాజ్కా టెక్టానిక్ ప్లేట్ ప్రతీ ఏడాది తూర్పు ఈశాన్య దిశగా 71 మి.మీ కదలుతోంది. దీంతో నాజ్కా, అమెరికా ప్లేట్లు పరస్పరం ఢీకొనడంతో భూకంపాలు నమోదు అవుతున్నాయి. ఈ ప్రాంతంలో చాలా లోతులో భూకంపాలు వస్తాయి. గతంలో భూమికి 600 కిలోమీటర్ల లోతులో కూడా భూకంపాలు సంభవించాయి. ఇదిలా ఉంటే తాజా భూకంపం భూమి లిథోస్పియర్ పొరలో సంభవించింనట్లు నిపుణులు చెబుతున్నారు. పెరూ- చిలీ ప్రాంతంలో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇక్కడ భూమి ఉపరితలం కింద నిరంతరం టెక్టానిక్స్ ప్లేట్స్ నిరంతరం స్థానభ్రంశం చెందుతుంటాయి.