Magnitude 7.5 Earthquake Hits Mexico: లాటిన్ అమెరికా దేశం మెక్సికోలో భారీ భూకంపం వచ్చింది. మైకోకాన్ రాష్ట్రంలోని లా స్లతాసిటీ డియోరెలోస్ కు దక్షిణ-ఆగ్నేయంగా 46 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. రిక్టర్ స్కేల్ పై 7.5 తీవ్రతతో భూకంప రావడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మిచోకాన్ తీరానికి సమీపంలో సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు యూఎస్ సునామీ హెచ్చరికలు వ్యవస్థ వెల్లడించింది.
భూకంప తీవ్రత 7.4గా ఉన్నట్లు మెక్సికో అధికారులు తెలుపగా.. 7.6గా యూఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. రాజధాని మెక్సికో సిటీకి భూకంప ప్రాంతం 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో దేశంలో పలు ప్రాంతాల్లో భూప్రకంపనల ప్రభావం ఉంది. భయాందోళనలకు గురైన ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలుస్తోంది. సెప్టెంబర్ 19, 1985 మెక్సికో సిటీలో 8.1 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 10,000 మందికి పైగా మరణించారు. ఆ సమయంలో దేశంలో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.
Read Also: Shashi Tharoor: కాంగ్రెస్ అధ్యక్ష పోటీలో శశిథరూర్.. ఓకే చెప్పిన సోనియా!
ఇటీవల కాలంలో పసిఫిక్ సముద్ర తీర దేశాల్లో వరసగా భూకంపాలు వస్తున్నాయి. ఇప్పటికే ఆదివారం రోజూ తైవాన్ కు సమీపంలో 7.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. తైవాన్ తో పాటు జపాన్, చైనా తీర ప్రాంతాల్లో భూకంప ప్రభావం స్ఫష్టంగా తెలిసింది. జపాన్ తన సమీప దీవుల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. శనివారం కూడా ఇదే ప్రాంతంలో 6.6 తీవ్రతతో భూకంపం వచ్చింది.
లాటిన్ అమెరికా దేశాలు, జపాన్, తైవాన్, ఆగ్నేయాసియా దేశాలు పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్ ’ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో సముద్రగర్భంలో అగ్నిపర్వతాలు క్రియాశీలకంగా ఉంటాయి. దీంతో పాటు టెక్టానిక్ ప్లేట్ల కదలికలు చోటు చేసుకుంటాయి. దీంతో తరుచుగా భూకంపాలు, సునామీలు వస్తుంటాయి.
