NTV Telugu Site icon

Earthquake: చైనా, అఫ్ఘానిస్తాన్‌ను అతలాకుతలం చేసిన భూకంపం.. భారీగా మరణాలు

Earthquake

Earthquake

Earthquake: చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేల్‌పై 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకు 21 మంది మరణించారని, చాలా మంది గాయపడ్డారని ప్రభుత్వ మీడియా నివేదించింది. సిచువాన్‌ ప్రావిన్స్‌లోని లూడింగ్‌కు సుమారు 39 కిలోమీటర్ల పరిధిలో ఈ భూకంప కేంద్రం ఏర్పడింది. నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో12:52 గంటలకు (బీజింగ్ సమయం) లూడింగ్ కౌంటీని తాకిన భూకంపం కారణంగా కొండచరియలు విరిగిపడి ఇళ్లకు నష్టం వాటిల్లిందని, విద్యుత్తు అంతరాయం ఏర్పడిందని చైనా మీడియా వెల్లడించింది. భూకంపం సంభవించిన ప్రాంతానికి సుమారు 226 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిచువాన్​ ప్రావిన్సు రాజధాని చెంగ్డులోనూ భూమి కంపించింది. 16 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చైనా భూకంప నెట్‌వర్క్‌​ కేంద్రం వెల్లడించింది. సిచువాన్ ప్రావిన్స్‌లోని ఫైర్ అండ్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్ 30 మందిని భూకంప కేంద్రానికి పంపింది. మరో 530 మంది రెస్క్యూ సిబ్బందిని మరో ఏడు ప్రాంతాల నుండి భూకంప కేంద్రానికి పంపారు. లూడింగ్‌లోని మోక్సీ టౌన్‌లోని భూకంప కేంద్రం వద్ద టెలికమ్యూనికేషన్‌లు ప్రస్తుతం నిలిపివేయబడ్డాయి. లూడింగ్ సమీపంలోని యాన్ నగరంలో 4.2 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు సమాచారం.

యురేసిన్​, టెక్టోనిక్ ప్లేట్లు కలిసే టిబెటన్ పీఠభూమి అంచున ఉన్న సిచువాన్ భూకంపాలకు గురవుతుంది. అందుకే ఈ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తాయి జూన్‌లో సంభవించిన రెండు భూకంపాల వల్ల కనీసం నలుగురు మరణించారు. ఏప్రిల్ 20, 2013 న, యాన్ నగరంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది, దీని ఫలితంగా 196 మంది మరణించారు. అంతకుముందు, మే 12, 2008న, సిచువాన్ ప్రావిన్స్‌లో 7.9 భూకంపం సంభవించింది, దీని ఫలితంగా 69,000 మంది మరణించారు. ఇటీవలి చరిత్రలో అత్యంత విధ్వంసక భూకంపాలలో ఇది ఒకటి.

PM Narendra Modi: బ్రిటీష్ పీఎం రేసులో గెలుపొందిన లిజ్ ట్రస్‌కు ప్రధాని మోడీ అభినందనలు

అఫ్ఘాన్‌లో భూకంపం: అఫ్ఘానిస్తాన్‌లోని పలు ప్రావిన్సులలో సోమవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించడంతో కనీసం ఆరుగురు మరణించగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. కునార్‌లోని నూర్గుల్ జిల్లాలో భారీ నష్టం జరిగినట్లు స్థానిక అధికారి వెల్లడించారు. ప్రావిన్స్‌లోని అనేక ప్రాంతాల్లో డజన్ల కొద్దీ నివాసాలు ధ్వంసమయ్యాయని టోలో న్యూస్ నివేదించింది.

భూకంప కేంద్రం తూర్పు నంగర్‌హార్ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్‌లో 10 కిలోమీటర్ల లోతులో ఉదయం 2.27గంటలకు సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. కాబూల్, నంగర్హర్, లఘ్మాన్, కునార్, నూరిస్తాన్, డ్యూరాండ్ రేఖకు అవతలి వైపున ఉన్న కొన్ని ప్రాంతాలలో భూకంపం సంభవించినట్లు ప్రారంభ నివేదికలు తెలిపాయి. పాకిస్థాన్‌లో డాన్ పత్రిక ప్రకారం, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్, మర్దాన్, అబోటాబాద్, స్వాబీ, మొహమ్మంద్, బజోర్, బునెర్ మరియు పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. అయితే, పాకిస్థాన్‌లో జరిగిన నష్టం లేదా ప్రాణనష్టం ఇంకా తెలియాల్సి ఉంది.

Show comments