NTV Telugu Site icon

Burj Binghatti: UAE మరో గిన్నిస్ రికార్డ్.. ప్రపంచంలోనే ఎత్తైన భవనం

Burj Binghatti

Burj Binghatti

Dubai Hypertower To Take Crown As World Tallest Residential Address: ఆకాశమే హద్దుగా ఎత్తైన భవనాలను నిర్మించడంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కేరాఫ్ అడ్రస్. ఎవ్వరికీ సాధ్యం కాని సరికొత్త ఇంజినీరింగ్ ఆవిష్కరణలు, భవంతులతో.. యూఏఈ ఇప్పటివరకూ ఎన్నో ఘనతల్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక బుర్జ్ ఖలీపా గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేయాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతానికి ప్రపంచంలో అదే అత్యంత ఎత్తైన భవనం. ఇప్పుడు యూఏఈ మరో సంచలనానికి తెరలేపేందుకు సిద్ధమవుతోంది. దుబాయ్‌లో అత్యంత ఎత్తైన నివాస భవనాన్ని నిర్మిస్తోంది. దుబాయ్‌ పరిధిలో ఆర్థిక ప్రాంతంగా పేరున్న ‘బిజినెజ్‌ బే’లో.. వంద ఫ్లోర్లతో ఒక హైపర్‌టవర్‌ని ఆవిష్కరించబోతోంది. దీంతో.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హైపర్‌టవర్‌గా ఇది గిన్నిస్ రికార్డ్ ఘనతని సొంతం చేసుకోబోతోంది.

అంతకుముందు ఈ రికార్డ్.. న్యూయార్క్‌ నగరంలోని మాన్‌హట్టన్‌ 57వ స్ట్రీట్‌లో సెంట్రల్‌ పార్క్‌ టవర్‌ పేరు మీద ఉండేది. ఆ భవనంలో 98 ఫ్లోర్స్‌ ఉన్నాయి. ఇప్పుడు దుబాయ్ హైపర్‌టవర్ అంతకంటే రెండు ఎక్కువ ఫోర్లతో కలిపి మొత్తం 472 మీటర్లతో ఎత్తుతో, దాని రికార్డ్‌ని బద్దలుకొట్టబోతోంది. కేవలం ఎత్తులోనే కాదు.. అత్యంత విలాసవంతమైన నివాస భవనంగానూ ఇది చరిత్రపుటలకెక్కబోతోంది. ఈ భవనాన్ని ఎమిరేటి ప్రాపర్టీ డెవలప్‌మెంట్‌ కంపెనీ ‘బింఘట్టి’, ప్రముఖ వాచ్‌మేకర్‌ కంపెనీ ‘జాకోబ్‌ అండ్‌ కో’ సంయుక్తంగా నిర్మించాయి. ప్రపంచ రికార్డు నెలకొల్పే ఉద్దేశంతోనే తాము ఈ హైపర్‌టవర్‌ను నిర్మిస్తున్నట్లు ఆ కంపెనీలు ప్రకటించాయి. ఆ రెండు సంస్థలు కలిసి ఈ నిర్మాణాన్ని చేపట్టాయి కాబట్టి.. తమ పేర్లతోనే ‘బుర్జ్‌ బింఘట్టి జాకోబ్‌ అండ్‌ కో రెసిడెన్సీ’గా దీనికి నామకరణం చేశారు.

ఈ భవనానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. దీని అగ్రభాగం డైమండ్ ఆకారంలో ఉంటుంది. అంతేకాదండోయ్.. రాత్రిపూట మిరుమిట్లు గొలిపే లైట్ల వెలుతురులో ఇది ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇందులో డబుల్‌, త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌లతో పాటు.. మరెన్నో ప్రత్యేకమైన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. చివరి ఐదు ఫ్లోర్‌లలో అత్యంత విలాసవంతమైన పెంట్‌హౌజ్‌లను సిద్ధం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. భూతల స్వర్గాన్ని తలపించేలా ఈ భవనం ఉండబోతోంది. అయితే.. ఈ భవనాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారన్న విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.

Show comments