Pakistan National Assembly: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దయింది. బుధవారం రాత్రి జాతీయ అసెంబ్లీ రద్దయింది. పాక్ జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విజ్ఞప్తి మేరకు జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని అధ్యక్షుడు అరీఫ్ అల్వీ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించారు. అంతకుముందు ఇస్లామాబాద్‌లో ఫెడరల్ క్యాబినెట్ చివరి సమావేశానికి కూడా ప్రధాని అధ్యక్షత వహించారు. బుధవారం నేషనల్ అసెంబ్లీలో తన వీడ్కోలు ప్రసంగంలో షరీఫ్ మాట్లాడుతూ.. ఈ రాత్రి, సభ అనుమతితో, జాతీయ అసెంబ్లీ రద్దుకు సంబంధించిన సలహాను అధ్యక్షుడికి పంపుతాను అని పేర్కొన్నారు. దీంతో పాక్ పార్లమెంట్ దిగువసభతో పాటు ముస్లిం లీగ్- నవాజ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మూడు రోజుల ముందుగానే రద్దు అయ్యింది. పాక్ జాతీయ అసెంబ్లీ రద్దు కావడంతో త్వరలోనే పాక్‌లో ఎన్నికలు జరగనున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం పదవీ కాలం పూర్తయిన తర్వాత రెండు నెలలులోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ, ముందస్తుగానే జాతీయ అసెంబ్లీ రద్దు కావడంతో ఎన్నికల నిర్వహణకు 90 రోజుల సమయం మాత్రమే ఉంది. గడువుకు కొన్ని గంటల ముందే పాకిస్తాన్ ప్రభుత్వం రద్దయిన నేపథ్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొలువుదీరనుంది. 90రోజుల్లో పూర్తిచేసేందుకు వెసులుబాటు లభించినప్పటికీ.. ఇవి మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.
Read also: Bhola Shankar: భోళా శంకర్‌కి అడ్డంకులు తొలిగాయ్.. ఇక రచ్చ రచ్చే అంటున్న మెగా ఫాన్స్
పాకిస్తాన్ పార్లమెంటు రద్దు కావడంతో నవంబర్‌లోనే ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. కానీ ఇవి మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఆరేళ్లలో దేశ జనాభా 16 శాతం (20 కోట్ల నుంచి 24కోట్లకు) పెరిగింది. తాజా నియోజకవర్గాల పునర్విభజన ప్రకారమే ఎన్నికలు జరపాలని పాకిస్తాన్ చట్టాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి కనీసం నాలుగు నెలలు పడుతుందని పాకిస్తాన్ ఎన్నికల సంఘం (ECP) చెబుతోంది. కాబట్టి పాకిస్థాన్‌లో ఎన్నికలు నిర్వహించడం ఈ ఏడాది సాధ్యం కాకపోవచ్చని.. మరింత సమయం పట్టే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. దేశంలో 2023లో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని పాక్ మంత్రి రాణా సనావుల్లా కూడా తన అభిప్రాయంగా చెప్పారు. తోషాఖానా కేసులో మూడేళ్ల జైలు అనుభవిస్తోన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఎన్నికల సంఘం ఐదేళ్ల వేటు వేసిన విషయం తెలిసిందే. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇస్లామాబాద్ హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్ అప్పీల్ చేశారు.. అక్కడ ఉపశమనం లభించకపోతే.. రానున్న ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్ పోటీ చేసే అవకాశం లేనట్టే.
