NTV Telugu Site icon

Bangladesh: బంగ్లాదేశ్‌కి హమాస్, తాలిబాన్, అల్-ఖైదా నేతలు.. భారత్ అలర్ట్..

Al Markazul Islami

Al Markazul Islami

Bangladesh: రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్ వ్యాప్తంగా హింసాత్మక నిరసనలు జరిగాయి. ఆ తర్వాత పరిణామాల్లో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయి వచ్చారు. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కిలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇదిలా ఉంటే, ఎప్పుడైతే షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయారో, అప్పటి నుంచి ఆ దేశంలో రాడికల్ ఇస్లామిక్ సంస్థలు యాక్టివ్ అయ్యాయి. యూనస్ ప్రభుత్వం పలువురు ర్యాడికల్ ఇస్లామిక్ నేతల్ని విడుదల చేసింది.

తాజాగా బంగ్లా రాజధాని ఢాకా వేదికగా తీవ్రవాద భావజాలం ఉన్న ‘‘అల్ మర్కజుల్ ఇస్లామీ’’ ఆధ్వర్యంలో భారీ మతపరమైన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హమాస్, తాలిబాన్, పాకిస్తాన్ నుంచి అనేక మంది రాడికల్ ఇస్లామిస్ట్ నేతలు వచ్చారు. ఈ పరిణామం పొరుగున ఉన్న భారత్‌ని భద్రతాపరమైన ఆందోళనలోకి నెట్టింది.

Read Also: Vettaiyan: ‘వేట్టయన్ ది హంటర్’ టైటిల్‌పై దిల్ రాజు క్లారిటీ.. అందుకే తమిళ్ లో పెట్టాం!

ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన అల్ మర్కజుల్ ఇస్లామీకి తీవ్రవాద సంస్థ అల్-ఖైదాతో సంబంధాలు ఉన్నాయి. 2023లో మరణించిన ఈ సంస్థ చీఫ్ ముఫ్తీ షాహిదుల్ ఇస్లాంకి అల్ ఖైదాతో ప్రత్యక్ష సంబందాలు ఉన్నాయి. ఇతను ఖుల్నాలో అహ్మదీయ మసీదుపై బాంబు దాడికి పాల్పడి, 8 మంది మరణానికి కారణమైన కేసులో 1999లో అరెస్ట్ చేయబడ్డాడు. విడుదలైన తర్వాత ఇస్లాం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఆఫ్రికాలోని పలు దేశాలకు వెళ్లాడు. అల్ ఖైదా నుంచి నేరుగా పేలుడు పదార్థాల శిక్షణ తీసుకున్నాడు. ఇతను మరణించిన తర్వాత కూడా బంగ్లాదేశ్‌లో చాలా మతపరమైన రాడికల్ సంస్థలపై ఇతడి ప్రభావం ఉంది. జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (JMB) వంటి తీవ్రవాద సంస్థలు ఇతడిని తమ కార్యకలాపాల్లో కీలకమైన వ్యక్తిగా పరిగణిస్తుంది.

అక్టోబర్ 07న ఢాకాలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ హమాస్ లీడర్ షేక్ ఖలీద్ ఖుద్దుమీ, హమాస్ పొలిటికల్ బ్యూరో చైర్మన్ షేక్ ఖలీద్ మిషాల్ సహా హమీస్ కీలక వ్యక్తులు హాజరయ్యారు. పాకిస్తాన్‌కి చెందిన ప్రముఖ ఇస్లామిస్ట్ వ్యక్తులు, షేఖుల్ ఇస్లాం ముఫ్తీ తకీ ఉస్మానీ మరియు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్‌లు కూడా ఉన్నారు. ఢాకాలో అధికారం మారిన తర్వాత భారతదేశంలోని చొరబాట్లు, దాడులకు కుట్ర పన్నే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.