బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారీ షాక్ తగిలింది. బ్యాంక్ అకౌంట్లతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులను సీజ్ చేయాలని ఢాకా న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన 124 బ్యాంక్ అకౌంట్లు స్తంభింపజేయనున్నారు.
గతేడాది ఆగస్టులో చెలరేగిన అల్లర్లతో ఆమె ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆగస్టు 5న పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చి తలదాచుకుంటున్నారు. అయితే మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం.. షేక్ హసీనాను తిరిగి రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. ఆమెకు చెందిన పాస్‌పోర్టును కూడా రద్దు చేసింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం చేస్తున్నా.. ఏ ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా ఢాకా కోర్టు.. బ్యాంక్ అకౌంట్లతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తులు సీజ్ చేయాలని ఆదేశించింది.
అవినీతి నిరోధక సంఘం (ఏసీసీ) డిప్యూటీ డైరెక్టర్ మోనిరుల్ ఇస్లాం.. హసీనా ఆస్తులు సీజ్ చేసేందుకు ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై మంగళవారం మెట్రోపాలిటన్ సీనియర్ ప్రత్యేక న్యాయమూర్తి జాకీర్ హుస్సేన్ విచారణ జరిపారు. అనంతరం హసీనాకు చెందిన ‘సుధాసదన్’ ఇంటితో సహా ఆమె కుటుంభసభ్యుల ఆస్తులు సీజ్ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందులో హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ జాయ్, కుమార్తె సైమా వాజెద్ వుతుల్, సోదరి షేక్ రెహానా, ఆమె కుమార్తెలకు చెందిన ఆస్తులు సైతం ఉన్నాయి. వీరిపై ప్రయాణ నిషేధాన్ని విధించారు. హసీనా, ఆమె కుటుంబసభ్యులకు చెందిన 124 బ్యాంకు ఖాతాల జప్తునకు ఆదేశించింది.