NTV Telugu Site icon

Candida Auris: అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్..

Candida Auris

Candida Auris

Candida Auris: అగ్రరాజ్యం అమెరికాను ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్ భయపెడుతోంది. క్యాండిడా ఆరిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ అక్కడ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే వాషింగ్టన్ రాష్ట్రంలో ఈ నెలలో నలుగురు వ్యక్తులకు ఈ ఫంగస్ సోకింది. అత్యంత అరుదైన, ప్రాణాంతక ఇన్ఫెక్షన్ అని, దీని వల్ల అధిక మరణాల రేటు కలిగి ఉండటంతో పాటు డ్రగ్ రెసిస్టెంట్ కలిగి ఉండీ, సులభంగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జనవరి 10న మొదటి కేసు నిర్ధారణ కాగా.. సియాటెల్, కింగ్ కౌంటీల్లో మూడు కేసులను గుర్తించారు. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వారికి ఈ ఫంగస్ సోకుతుందని, ఇది అనేక యాంటీ ఫంగల్ మందుకు నిరోధక కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఆస్పత్రుల్లో ఫీడింగ్, బ్రీతింగ్ ట్యూబులు, కాథెటర్‌లను ఉపయోగించే రోగుల్లో తరుచుగా ఈ ఇన్ఫెక్షన్‌ వెలుగులోకి వస్తుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) ప్రకారం.. ఇది ఓపెన్ గాయాలు, చెవులు, రక్త ప్రసరణ వంటి మార్గాల ద్వారా శరీరంలోకి ఫంగస్ చేరుతుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లాగానే కాండిడా ఆరిస్ లక్షణాలను కలిగి ఉంటుంది.

Read Also: Chiranjeevi: బూతుల రాజకీయాలు నా వల్ల కాలేదు.. అందుకే బయటకు వచ్చేశా..

అనారోగ్యం బారిన పడకున్నా ఈ వ్యాధిని ఒక వ్యక్తి చర్మం, ఇతర శరీర భాగాల్లో కనుగొనవచ్చు. ఒక వ్యక్తి అనారోగ్యానికి గురికాకున్నా మరో వ్యక్తికి దీన్ని అంటించొచ్చు. వ్యాధి బారిన పడిన రోగిని వేరే గదిలో ఉంచి, క్రిమిసంహారక మందుల్ని రూం అంతటా స్ప్రే చేయాలి, అతని దగ్గరకు వెళ్లేటప్పుడు పూర్తిగా శరీరాన్ని కప్పే గౌన్లను ధరించాలని నిపుణులు చెబుతున్నారు. 15 ఏళ్ల క్రితం కాండిడా ఆరిస్‌ని జపాన్‌లో కనుగొన్నారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ ఇన్ఫెక్షన్ బయటపడుతూనే ఉంది. 2016లో 53 మందికి సోకిగా.. 2022లో 2377 మందికి సోకింది. అమెరికాతో పాటు 40 దేశాల్లో ఈ ఫంగస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు సీడీసీ వెల్లడించింది.