ప్రస్తుతం భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి శాంతించింది. ప్రస్తుతం రోజువారీ 5వేల లోపే కేసులు నమోదవుతున్నాయి. అయితే చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దేశంలో కొవిడ్ కేసులను సున్నాకు తేవాలనే చైనా ప్రయత్నాలను కరోనా వమ్ము చేస్తోంది. ఆ దేశంలోని పలు నగరాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. 2020 మార్చి తర్వాత గత రెండు రోజులుగా అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. చైనాలో ఆదివారం 312 కరోనా కేసులు నమోదుకాగా సోమవారం మరో 214 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.
గ్వాంగ్ డాంగ్, జిలిన్, షాన్ డాంగ్ ప్రావిన్సు వంటి నగరాలలో మెజారిటీ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు చైనాలో ఇప్పటికే 80 శాతం మందికి కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. అయినా చైనాలో ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నాయి. కాగా 2019 మార్చి నుంచి 2022 మార్చి 6 నాటికి చైనాలో ఇప్పటివరకు 1,11, 195 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ.
