Site icon NTV Telugu

India And Japan: ఇండో-పసిఫిక్‌లో యథాతథ స్థితే కొనసాగింపు: జపాన్‌

India And Japan

India And Japan

India And Japan: ఇండియా, జపాన్‌ల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న సంబంధాలు యధావిధిగా కొనసాగుతాయని ఇరు దేశాల ప్రతినిధులు తెలిపారు. రెండు దేశాలు పరస్పర మిత్ర దేశాలని.. అన్ని రకాలుగా భాగస్వామ్య దేశాలుగా కొసాగుతాయని ప్రకటించాయి. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ తమకు విడదీయలేని భాగస్వామి అని జపాన్‌ విదేశాంగ మంత్రి యోషిమస హయషి పేర్కొన్నారు. ఇండియాతో సంబంధాలను భవిష్యత్తులో మరింత బలోపేతం చేసుకుంటామని చెప్పారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన ఆయన.. శుక్రవారం ‘ఇండియా-జపాన్‌ ఫోరమ్‌’ సదస్సులో పాల్గొన్నారు. జీ-20 కూటమికి భారత నాయకత్వం విజయవంతమయ్యే దిశగా కలిసి పనిచేయడానికి తాము చాలా ఉత్సాహంగా ఉన్నామని తెలిపారు. ఇండో-పసిఫిక్‌లో యథాతథ స్థితిని మార్చేందుకు ఎవరు ప్రయత్నించినా సహించేది లేదని స్పష్టం చేశారు. గ్లోబల్‌ సౌత్‌గా అభివర్ణించే పేద దేశాల సమస్యలను తీర్చకపోతే అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలనే పిలుపు కేవలం నినాదంగానే ఉండిపోతుందని హయషి అన్నారు.

Read also: Kolkata High Court: అవసరమైతే యోగి ప్రభుత్వం నుంచి బుల్డోజర్లు అద్దెకు తీసుకోండి.. హైకోర్టు సంచలన తీర్పు

జపాన్‌ తమకు సహజ మిత్రదేశమని సదస్సులో పాల్గొన్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ పేర్కొన్నారు. క్వాడ్‌ విషయంలో తాము ఆశాభావంతో ఉన్నట్లు వెల్లడించారు. ఆ కూటమి పనైపోయిందని ప్రతి ఆర్నెల్లకోసారి కొందరు చెబుతుంటారని.. కానీ అంతలోనే అది రెట్టింపు శక్తితో వస్తుంటుందని పేర్కొన్నారు. ఉగ్రవాదం, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు, ఆధునికీకరణపై సదస్సులో జైశంకర్‌, హయషి చర్చించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని వివిధ దేశాల్లో చేసిన పర్యటనలు, పలు ఇతర సందర్భాల్లో తమ మంత్రిత్వ శాఖ అందించిన సేవలపై పార్లమెంటులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే విపక్షాలు అడ్డుపడుతున్నాయని పేర్కొన్న మంత్రి.. ఆ వివరాలతో శుక్రవారం ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌. ఆ వీడియోను ట్విటర్లో పంచుకున్నారు. ‘దేశ పురోగతి కంటే పక్షపాత రాజకీయాలే విపక్షాలకు ముఖ్యం కావడం విచారకరం. ఉభయ సభల్లో నేను ప్రకటన చేయకుండా అవి అడ్డగిస్తున్నాయి. విదేశాల్లో నిర్బంధంలో ఉన్న మత్స్యకారులు, కల్లోలిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రవాసులు, వివిధ దేశాల్లోని వృత్తి నిపుణులకు వీసాలు వంటి అనేక అంశాల్లో మోదీ సర్కారు తగిన రీతిలో స్పందిస్తోంది. వీటన్నింటినీ తగిన రీతిలో చర్చించేందుకు అవకాశం లభించకపోవడం దురదృష్టకరం’ అని మంత్రి వీడియోలో తెలిపారు.

Exit mobile version