NTV Telugu Site icon

US Intelligence Leaked: ఇరాన్‌పై యుద్ధానికి సిద్ధమవుతున్న ఇజ్రాయిల్.. యూఎస్ రహస్య పత్రాలు లీక్..

Us Intelligence Leaked

Us Intelligence Leaked

US Intelligence Leaked: క్లాసిఫైడ్ అమెరికా ఇంటెలిజెన్స్ సమాచారం లీకైంది. సున్నితమైన సమాచారం లీక్ కావడంతో అమెరికా అధికారుల్లో ఆందోళన పెరిగినట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడికి సంబంధించిన వివరాలు లీకైన ఇంటెలిజెన్స్ రిపోర్టులో ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికన్ గూఢచారి ఉపగ్రహాలు సేకరించే చిత్రాలను, సమాచారన్ని విశ్లేషించే బాధ్యత కలిగిన నేషనల్ జియోస్పేషియల్-ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (NGA) నుంచి ఈ రహస్య సమచారం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్ ఆర్మీ ఎక్సర్‌సైజ్, ఆపరేషనల్ రెడీనెస్‌కి సంబంధించిన సమాచారం ఇందులో ఉంది.

అక్టోబర్ 15, 16 తేదీల్లోని ఈ రెండు పత్రాలు, ఇరాన్‌తో ముడిపడి ఉన్నాయి. ఇరాన్‌పై ప్రతీకార దాడికి ఇజ్రాయిల్ సైనిక వ్యాయామాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 01న ఇరాన్ ఇజ్రాయిల్‌పై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. 200 క్షిపణులను ఇజ్రాయిల్‌పైకి ప్రయోగించింది. అప్పటి నుంచి ఇరాన్‌పై ఏ క్షణమైనా ఇజ్రాయిల్ దాడికి పాల్పడొచ్చనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ముఖ్యంగా ఇరాన్ చమురు క్షేత్రాలు, అణు స్థావరాలపై దాడి చేయొచ్చని అంతా అనుకుంటున్నారు.

Read Also: Railway Rules: రైలులో ఈ వస్తువులను తీసుకెళ్లలేరు.. తీసుకెళ్తే జరిమానా, జైలు శిక్ష తప్పదు సుమీ

ప్రస్తుత లీకైన పత్రాల్లో ఒకటి.. ఇజ్రాయిల్ వైమానిక దళం ఇరాన్‌పై దాడికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుపుతోంది. రిహార్సల్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సన్నాహాల్లో యుద్ధవిమానాలకు ఆకాశంలో ఇంధనం నింపడం, సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్లు, ఇరాన్ దాడి చేస్తే దానిని అడ్డుకునేందుకు క్షిపణి వ్యవస్థ మోహరింపు వంటివి ఉన్నాయి. రెండో పత్రాంలో ఆయుధాలు, ఇతర సైనిక ఆస్తులను వ్యూహాత్మక స్థానాలకు తరలించడానికి ఇజ్రాయిల్ చేస్తున్న ప్రయత్నాలను వెల్లడిస్తోంది. అయితే, ఈ రహస్య పత్రాలు ఇజ్రాయిల్ సైనిక కదలికలను, వ్యాయామాలను వివరించినప్పటికీ, అవి ఉపగ్రహ చిత్రాలను అందించలేదు. ఈ పత్రాలు ఇరాన్‌పై ఇజ్రాయిల్ పూర్తి ప్రణాళికలను వెల్లడిస్తున్నాయా..? లేదా..? అనేది అస్పష్టంగా ఉంది.

అయితే, ఈ లీక్ ఎక్కడి నుంచి జరిగిందనేది ఇంకా అస్పష్టంగానే ఉంది. ప్రాథమిక వివరాల ప్రకారం ఒక దిగువ స్థాయి ఉద్యోగి ఈ డాక్యమెంట్లను తీసుకున్నట్లు తెలుస్తోంది. పెంటగాన్, యూఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ఎఫ్‌బీఐలు కలిసి ఈ లీకేజ్ గురించి దర్యాప్తు చేస్తున్నారు.